Let's talk: editor@tmv.in
అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం!

అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం!

Venkatesh Balusula
16 సెప్టెంబర్, 2025

ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జీ7, నేటో దేశాలకు పిలుపునిచ్చారు. దీనిపై చైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా సుంకాల పెంపు విషయంలో ఏకపక్షంగా, బలవంతపు ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించింది. దీనిపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్పెయిన్లో జరుగుతున్న చైనా, అమెరికా ఆర్థిక చర్చల సందర్భంగా చైనా నుంచి ఈ స్పందన వచ్చింది.

చర్చలతోనే పరిష్కారం

ఇటీవల నాటో దేశాలతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్లో ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి చైనాపై 50 నుంచి 100 శాతం వరకు సుంకాలు విధించాలని, రష్యా చమురు కొనుగోళ్లు ఆపాలని నాటో దేశాలను ప్రోత్సహించారు. ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ జీ7 ఆర్థిక మంత్రులతో మాట్లాడుతూ ట్రంప్ సూచనల ప్రకారం చమురు కొనే దేశాలపై సుంకాలు విధించాలని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి లిన్ జియాన్ మాట్లాడుతూ అమెరికా చర్యలు ఏకపక్షంగా ఉండటంతో పాటు, బలవంతపు ధోరణితో ఆర్థిక ఒత్తిడి పెంచుతోందని విమర్శించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య నియమాలను ఉల్లంఘించడమేనని, ప్రపంచ సరఫరాకు ఆటంకం కలిగిస్తుందని చెప్పారు. ఒత్తిడి, బలవంతం సమస్యలు పరిష్కరించవని, ఉక్రెయిన్ సంక్షోభంపై చైనా స్పష్టమైన ఉద్దేశంతో ఉందని, చర్చలు మాత్రమే మార్గమని చెప్పారు. చైనా, రష్యా వాణిజ్య భాగస్వామ్యం చట్టబద్ధంగా, ఆర్థిక నియమాలను అనుసరించి నడుస్తోందని స్పష్టం చేశారు.

రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా ట్రంప్ ఇప్పటికే భారత్పై అదనంగా 25 శాతం సుంకాలు విధించారు. ఇది ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాలను తీవ్ర ప్రభావితం చేస్తోంది. ఈ సంఘటనలు ప్రపంచ వాణిజ్యంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రష్యా చమురు దిగుమతులు చైనాలో 3.64 బిలియన్ డాలర్లు, భారత్లో 3.4 బిలియన్ డాలర్లకు చేరాయి. యూరప్ కూడా రష్యా నుంచి కొనుగోళ్లు చేస్తోంది. ట్రంప్ సూచనలు యూరప్ దేశాలను ఆలోచనలో పడేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలువురు అధికారులు స్పందించారు. సుంకాలపై తమకు స్పష్టమైన విధానాలు ఉన్నాయని, ట్రంప్ సూచనలను పాటించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ట్రంప్కు ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలనే ఆలోచన ఉన్నా, ఇతర దేశాలపై ఒత్తిడి పెంచడం సరైన నిర్ణయం కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తుంది. చైనా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచడం మానుకొని శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యే మార్గాలను అనుసరించాల్సి ఉంది.

అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం! - Tholi Paluku