Let's talk: editor@tmv.in
అమెరికాను విడిచి వెళ్లండి

అమెరికాను విడిచి వెళ్లండి

Venkatesh Balusula
21 సెప్టెంబర్, 2025

అక్ర‌మ వ‌ల‌స‌ల‌పై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సిరియా పౌరులకు తాత్కాలిక రక్షణ స్థితిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉన్న సిరియన్ వలసదారులు 60 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని, లేకపోతే అరెస్టు, బహిష్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వలసదారులకు చట్టపరమైన హోదాను రద్దు చేసే విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. 2012 నుంచి ఈ హోదా కలిగి ఉన్న 6,000 మందికి పైగా సిరియన్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రతినిధి ట్రిషియా మెక్‌లాఫ్లిన్ మాట్లాడుతూ సిరియాలో ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయని, ఆ దేశ పౌరులు తిరిగి స్వదేశానికి వెళ్లవచ్చన్నారు.

సిరియా దాదాపు రెండు దశాబ్దాలుగా ఉగ్రవాదం, తీవ్రవాదానికి కేంద్రంగా ఉందని, సిరియన్లను అమెరికాలో ఉండనివ్వడం దేశ జాతీయ ఆసక్తులకు విరుద్ధమని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న సిరియన్ పౌరులు 60 రోజుల్లో స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లాలని సూచించారు. 60 రోజుల తర్వాత సిరియన్ పౌరులు స్వచ్ఛందంగా వెళ్లకపోతే అరెస్టు చేస్తామన్నారు. ట్రంప్ దశాబ్దాలుగా అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న లక్షలాది వలసదారులకు తాత్కాలిక చట్టపరమైన హోదాను రద్దు చేయాలని చూస్తున్నారు. చాలామంది వలసదారులు ఈ రక్షణకు అర్హులు కాదని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. డెమొక్రాట్లు, వలసదారుల కోసం వాదించే సంస్థలు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాను విడిచి వెళ్లండి - Tholi Paluku