Let's talk: editor@tmv.in
అమెరికాకో దండం

అమెరికాకో దండం

FL - TRND
25 సెప్టెంబర్, 2025

అమెరికా విశ్వవిద్యాలయాలపై విదేశీ విద్యార్థుల ఆసక్తి గణనీయంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా భారతీయుల సంఖ్యలో కనిపిస్తున్న భారీ క్షీణత అక్కడి విద్యా రంగానికి పెద్ద సవాలుగా మారింది. 2025 ఆగస్టులో అమెరికాకు వచ్చిన మొత్తం అంతర్జాతీయ విద్యార్థులు 3లక్షల 13వేలు మాత్రమే. 2024లో ఇదే సమయంలో 3 లక్షల 87వేల మంది చేరుకున్నారు. అంటే ఒకే ఏడాదిలోనే దాదాపు 74,000 మంది తక్కువయ్యారు. ఇది గత నాలుగేళ్లలో ఆగస్టు నెలలో నమోదైన కనిష్ఠ సంఖ్య. దేశాల వారీగా చూస్తే చైనా నుంచి 86,647 మంది వచ్చారు కానీ గత ఏడాదితో పోలిస్తే 12.4 శాతం తగ్గుదల నమోదైంది. ఇండియా నుంచి కేవలం 41,540 మంది మాత్రమే చేరుకున్నారు. ఇది 44.5 శాతం భారీ క్షీణత. దక్షిణ కొరియా నుంచి 16,412 మంది విద్యార్థులు చేరగా 10.9 శాతం తగ్గుదల ఉంది. వియత్నాం నుంచి 7,883, తైవాన్ నుంచి 7,844, బ్రెజిల్ నుంచి 8,082 మంది వచ్చారు. ఈ దేశాలన్నీ కూడా 6 నుంచి 17 శాతం మధ్యలో తగ్గుదల చూపించాయి. యూకే మాత్రం కొంచెం భిన్నంగా 7,501 మంది విద్యార్థులను పంపి 6.6 శాతం పెరుగుదల నమోదు చేసింది.

మీరు డేటా గమనిస్తే భారత విద్యార్థుల గణాంకాలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. 2025 జనవరిలో భారతీయ విద్యార్థుల రాక 75,000గా ఉండగా.. 2024లో ఇదే సంఖ్య 77,900. ఇది కేవలం 3.7 శాతం తగ్గుదల. కానీ ఫిబ్రవరిలో 23.8 శాతం, మార్చిలో 5.1 శాతం, ఏప్రిల్‌లో 23.8 శాతం, మేలో 30.9 శాతం, జూన్‌లో 40.7 శాతం తగ్గింది. జూలైలో 46.4 శాతం, ఆగస్టులో 44.5 శాతం భారీ క్షీణత నమోదైంది.

ఇటు 2019లో అమెరికాకు చేరిన విదేశీ విద్యార్థులు 4 లక్షలు దాటినా, 2020లో కరోనా మహమ్మారి కారణంగా కేవలం 53,000కి పడిపోయారు. తర్వాతి సంవత్సరాల్లో మళ్లీ పెరిగినా, 2025లో మళ్లీ తగ్గుదల మొదలైంది. వరుసగా ఐదు నెలలుగా పడిపోవడం అక్కడి విశ్వవిద్యాలయాలకు పెద్ద ఆర్థిక దెబ్బగా మారింది. అమెరికా విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థుల రాక అంటే కేవలం విద్యార్థుల సంఖ్య మాత్రమే కాదు, బిలియన్ల డాలర్ల ఆదాయానికి కూడా మూలం. ఫీజులు, హాస్టల్ ఖర్చులు, జీవన వ్యయం అన్నీ కలిపి వారు సంవత్సరానికి దాదాపు పదుల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారు. కాబట్టి ఆగస్టులో ఒక్కసారిగా 19 శాతం తగ్గుదల రావడం చిన్న విశ్వవిద్యాలయాలకు తీవ్ర సమస్య. ఎందుకంటే వాటి ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా విదేశీ విద్యార్థులపై ఆధారపడి ఉంటుంది.

ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు అమెరికా కొత్త వలస విధానాలు, వీసా నిబంధనల్లో పెరుగుతున్న కఠినత, అలాగే వేసవి దరఖాస్తుల సమయంలో విద్యార్థులపై పడిన ఒత్తిడిగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ తీసుకొస్తున్న 'అమెరికా ఫస్ట్' విధానాలు అనేక అడ్డంకులను సృష్టించాయి. ఫలితంగా అనేకమంది భారతీయులు అమెరికా బదులుగా యూరప్ లేదా ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, అమెరికా ఈ క్షీణతను ఆపగలదా? లేక యూరప్, చైనా, ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు భారతీయ ప్రతిభను మరింతగా ఆకర్షించుకుంటాయా? ఏమో అంతా ట్రంప్‌గారి నిర్ణయాలపైనా ఆధారపడి ఉంది మరి! లెట్స్ సీ!

అమెరికాకో దండం - Tholi Paluku