
అమ్మకాల్లో మారుతి సుజుకీ జోరు
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ దసరా పండుగ సీజన్ లో జీఎస్టీ 2.0 విధానం ప్రారంభమైనప్పటి నుండి రిటైల్ అమ్మకాలలో 75,000 యూనిట్ల మైలురాయిని దాటినట్లు ప్రకటించింది. డిమాండ్ అసాధారణంగా పెరగడంతో చిన్న వాహనాలలోని కొన్ని వేరియంట్లకు త్వరలో వెయిటింగ్ పీరియడ్‌లు ఏర్పడే అవకాశం ఉందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్&సేల్స్) పార్ధో బెనర్జీ గురువారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మా రిటైల్ అమ్మకాలు 75,000 యూనిట్లకు చేరుకున్నాయని తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 40,000 నుండి 45,000 మంది తమ కార్లను పరిశీలించేందుకు వస్తుంటారని, అయితే ఇప్పుడు రోజుకు దాదాపు 80 వేల మంది పరిశీలించేందుకు వస్తున్నాయని, ఇది దాదాపు రెట్టింపు అని ఆయన తెలిపారు. నవరాత్రి మొదటి రోజు నుండే మారుతి సుజుకీ షోరూమ్‌లకు వినియోగదారులు భారీగా తరలివస్తున్నారని, సగటున రోజుకు 18,000 బుకింగ్‌లు నమోదవుతున్నాయని పార్ధో బెనర్జీ పేర్కొన్నారు.
చిన్న కార్లకు భారీ డిమాండ్
పండుగ సీజన్‌లో కంపెనీ చిన్న కార్లకు భారీగా డిమాండ్ లభిస్తోందని బెనర్జీ తెలిపారు. "చిన్న కార్ల విభాగంలో మంచి స్పందన కనిపిస్తోందని, ఎంట్రీ లెవల్ కార్ల విభాగంలో బుకింగ్ వృద్ధి 50 శాతంగా ఉందని చెప్పారు. బ్రెజా, డిజైర్, బలినో వంటి మోడళ్లకు అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు.
సోమవారం నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ 2.0 విధానంలో వాహనాలపై జీఎస్టీ రేట్లు మునుపటి 28 శాతం నుండి 31 శాతం వరకు, 43 శాతం నుండి 50 శాతం వరకు ఉన్న వాటిని 18 శాతం, 40 శాతానికి తగ్గించారు. కాగా ఈ గణనీయమైన వాహన అమ్మకాలు భారతదేశ ఆటోమొబైల్ రంగానికి సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. పండుగ సీజన్ ముగిసే వరకు ఈ ఉత్సాహం కొనసాగే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
