Let's talk: editor@tmv.in
అభివృద్ధి వర్సెస్ అరాచకం మధ్య పోరు:కేటీఆర్‌

అభివృద్ధి వర్సెస్ అరాచకం మధ్య పోరు:కేటీఆర్‌

Gaddamidi Naveen
16 అక్టోబర్, 2025

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక కేవలం పార్టీల మధ్యనో, ఇద్దరు వ్యక్తుల మధ్యనో జరుగుతున్న ఎన్నిక కాదని, ఇది 'పదేళ్ల అభివృద్ధి పాలనకు, రెండేళ్ల అరాచక పాలనకు' మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

సంక్షేమ హామీలు వర్సెస్ పాలన వైఫల్యం

ఈ ఉపఎన్నికలో సునీత గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఆమె గెలిస్తేనే, ప్రభుత్వం హామీ ఇచ్చిన నెలకు రూ. 2500 ఇస్తుందని వారు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, రైతుబంధు అమలు, రెండు లక్షల ఉద్యోగాల హామీపై మోసపోయిన యువత, రైతులు సైతం ఈ ఎన్నికను పరిశీలిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు కూలగొట్టిన అరాచకాలు, మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, నిలిచిపోయిన ఉచిత తాగునీరు వంటి అంశాలు ప్రజలకు గుర్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ గ హైదరాబాద్‌లో కట్టిన లక్ష ఇళ్లు ప్రజల మదిలో ఉన్నాయని గుర్తు చేశారు.

వర్గాల ఆగ్రహం, బీఆర్‌ఎస్‌కు మద్దతు

మైనార్టీలను దారుణంగా అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి, బీసీ డిక్లరేషన్, దళిత బంధు, అభయహస్తం హామీలతో మోసపోయిన దళితులు, బీసీలు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహంతో ఉన్నారని, వీరందరి మద్దతు తమ అభ్యర్థికి లభిస్తోందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

సునీత గోపీనాథ్‌కు టికెట్ కేటాయింపు

మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణంతో ఆయన కుటుంబానికి అండగా నిలవడానికి, నియోజకవర్గానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆయన సతీమణి సునీత గోపీనాథ్‌కు టికెట్ కేటాయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. సునీత గెలుపు కోసం పార్టీ కీలక నాయకులంతా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. అన్ని వర్గాల అండదండలతో సునీత ఘన విజయం సాధిస్తారని, ఈ ఉపఎన్నికతోనే రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర తిరిగి ప్రారంభం కాబోతుందని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధి వర్సెస్ అరాచకం మధ్య పోరు:కేటీఆర్‌ - Tholi Paluku