Let's talk: editor@tmv.in
అభివృద్ధి పేరుతో తీర ప్రాంతంలో మత్య్సకారుల పొట్ట కొట్టొద్దు: సిపిఎం

అభివృద్ధి పేరుతో తీర ప్రాంతంలో మత్య్సకారుల పొట్ట కొట్టొద్దు: సిపిఎం

FL - SUNL
13 అక్టోబర్, 2025

అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో సముద్రతీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల జీవనంపై దెబ్బకొడుతున్నారని, జీవితాలను నాశనం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విజయవాడలో బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. సముద్రతీర ప్రాంతంలో లక్షలాదిమంది మత్స్యకారులు జీవిస్తున్నారని, వేలమంది వేటపై ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ సముద్రంలో చేపల వేటపై ఆధారపడి బతుకుతున్నారని, అటువంటి వారి జీవితాలను అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. కాలుష్యం దెబ్బకు తీర ప్రాంతంలో చిన్నబోట్లకు చేపలు దొరకడం లేదని, పెద్ద బోట్లతో లోపల సుమారు ఐదుకిలోమీటర్ల దూరం వెళ్లి పట్టుకోవాల్సి వస్తోందని తెలిపారు. కెమికల్‌ పరిశ్రమలు వదిలే కాలుష్యంతో చేపలు నాశనం అవుతున్నాయని, దీంతో ఉపాధి పోతోందని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఫార్మా కాలుష్యం ఎక్కువగా ఉందని, మంచినీరు కూడా ఉండటం లేదని అన్నారు. అదే జిల్లాలో దాడి గ్రామం చుట్టూ విషపూరిత కెమికల్‌ ఫ్యాక్టరీలతో ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిరదని పేర్కొన్నారు. అభివృద్ది గురించి మాట్లాడేవారు, సిఎం, మంత్రులు ఒకసారి దాడి గ్రామాన్ని పరిశీలించాలని డిమాండు చేశారు. దానిపక్కనే 5000 ఎకరాలు గతంలో బల్క్‌డ్రగ్‌ ఫ్యాక్టరీకి కేటాయించారని, దానిలో 2500 ఎకరాలు మిట్టల్‌ స్టీల్‌కు ఇచ్చి మరలా బల్క్‌డ్రగ్‌ ఫ్యాక్టరీకి భూములు తీసుకుంటామని చెబుతున్నారని విమర్శించారు. రాజయ్యపేట హోమ్‌శాఖ మంత్రి అనిత నియోజకవర్గంలో ఉందని, కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆమెను గ్రామంలోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఫ్యాక్టరీల ఏర్పాటుపై పున:పరిశీలిస్తామని, ముందడుగు వేయబోమని హామీ ఇచ్చిన తరువాతే వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడిరదని అన్నారు. మంత్రిని ప్రశ్నించిన వారందరూ తెలుగుదేశాన్ని నమ్మి ఓట్లు వేశారని,కెమికల్‌ ఫ్యాక్టరీ పెట్టబోమని ఎన్నికల ముందు హామీ ఇస్తే నమ్మి గెలిపించారని తెలిపారు. అధికారంలోకి రాగానే ప్రజల గొంతు కోశారని అన్నారు. శ్రీకాకుళంలో ఉద్ధానంలో కార్గో ఎయిర్‌పోర్టు పేరుతో వేల ఎకరాలు తీసుకుంటూ పక్కనే ఉన్న ఎసైన్డ్‌ భూములూ లాగేసుకుంటున్నారని తెలిపారు. దగ్గర్లోనే భోగాపురం ఎయిర్‌పోర్టు ఉంటే మరలా ఇదెందుకని ప్రశ్నించారు. ఉద్ధానంలో ఎక్కువమంది మత్స్యకారులు, పేదలు ఉన్నారని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ తీరంలో కాలుష్యం నుండి రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచిపోయారని అన్నారు. హామీ అమలు జరగనందున ప్రజలంతా రోడ్లపై పడితే ఇప్పుడు పవన్‌కల్యాణ్‌కు గుర్తుకువచ్చిందని తెలిపారు. ఇప్పుడు 100 రోజుల్లో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని, ఇదెంతవరకు నెరవేరుస్తారో చూడాలని అన్నారు. ఉప్పాడ సమీపంలోనే ఎస్‌ఈజెడ్‌లో పదివేల ఎకరాలు ఉందని, అక్కడ అభివృద్ధి లేదని అన్నారు. ఈ ప్రాంతంలో అరబిందో, దివీస్‌ కోసం మత్స్యకారులను బలిచేస్తున్నారని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో టూరిజం పేరుతో మత్స్యకారుల జీవితాలను ఫణంగా పెట్టారని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల వల్ల అక్కడ సముద్రంలో వేటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిరదని అన్నారు.

నెల్లూరు జిల్లా కరేడులోనూ మత్స్యకార గ్రామాల్లో బిపిసిఎల్‌, ఇండోసోల్‌ పేరుతో భూములు తీసుకుని వారికి జీవితం లేకుండా చేస్తున్నారని అన్నారు. కృష్ణపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌ పెడతామని చెప్పి పెట్టలేదని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాలను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు. గుజరాత్‌లో వద్దని తరిమేసిన పరిశ్రమలను, పశ్చిమదేశాల చెత్తను ఆంధ్రతీర ప్రాంతంలో పరిశ్రమల పేరుతో వేస్తున్నారని అన్నారు. వారి లాభాలకోసం రాష్ట్ర ప్రజలు బలికావాలా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలు చెప్పినట్లు వింటామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాన్‌, లోకేష్‌ అధికారంలోకి రాగానే ప్రజలను అణచివేస్తున్నారని తెలిపారు. అనకాపల్లిలో సిపిఎం నాయకులను గృహ నిర్బంధంచేసి రాజయ్యపేట రాకూడదని ఆంక్షలు పెట్టారని అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో నుండి వ్యక్తమవుతున్న ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి వారి అభిప్రాయాన్ని గౌరవించాలని శ్రీనివాసరావు ప్రభుత్వానికి సూచించారు.

విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించాలి

కేంద్రం, రాష్ట్రాలకు పంపించిన విద్యుత్‌ సవరణ బిల్లును ఆమోదించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీనివాసరావు కోరారు. ఇది ఫెడరల్‌ వ్యవస్థను దెబ్బతీయడమేనని విద్యుత్‌ రాష్ట్ర పరిధిలో ఉన్నా కేంద్రమే జాతీయస్థాయిలో బిల్లు చేయడం అంటే రాష్ట్రాల హక్కులను హరించడమేనని అన్నారు. ఇప్పటికే సహకార, వ్యవసాయ, విద్య, వైద్యాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోందని తెలిపారు. విద్యుత్‌ సవరణ బిల్లును ఆమోదించడం అంటే దాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతారని అన్నారు. డిస్కంలను ప్రైవేటుపరం చేసి ఒక ఏరియాలో నాలుగైదు డిస్కమ్‌లు ఏర్పాటు చేసి, క్రాస్‌ సబ్సిడీలు ఎత్తేసి, కాస్ట్‌టు ప్రొడక్షన్‌ పేరుతో లాభాలతో సహా ఖర్చును వినియోగదారుల నుండి వసూలు చేస్తారని అన్నారు. వినియోగదారులు భవిష్యత్‌లో ఓపెన్‌ మార్కెట్లోనే విద్యుత్‌ కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి వస్తుందని తెలిపారు. విద్యుత్‌ రంగంలో అవినీతి, నిర్వహణలోపం వల్లే నష్టాలు వస్తున్నాయని, లైన్లు వేయడం, ప్రైవేటు ఉత్పత్తి మొదలుకొని ఒప్పందాల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని అన్నారు. అక్కడ వారికి దోచిపెట్టేందుకే డిస్కమ్‌లను ప్రైవేటుపరం చేస్తున్నారని అన్నారు. ప్రైవేటుపరమైన ఎయిర్‌లైన్స్‌, బొగ్గు, ఫార్మా, టెలికాం వంటివి నష్టాల్లో కూరుకుపోయాయని తెలిపారు. ఇదే ప్రైవేటు సమర్థతా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండు చేశారు.

రాజధానిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

రాజధానిలో మరో 44 వేల ఎకరాలను రెండోదశలో సమీకరణలో తీసుకునేందుకు సిద్ధమయ్యారని, ఇవ్వకపోతే బలవంతంగా తీసుకునేందుకు సేకరణకు సిద్ధమయ్యారని, ఇలా చేయడం అంటే రాజధాని నిర్మాణం ప్రమాదంలో పడుతుందని శ్రీనివాసరావు విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలను 5000 ఎకరాల్లో పూర్తిచేసి కార్యకలాపాలు ప్రారంభిస్తే తరువాత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. వాస్తవంగా రాజధానిలో ఏమి జరుగుతుందో రైతులకు తెలియడం లేదని పేర్కొన్నారు. వాళ్లంతా గందరగోళంలో ఉన్నారని అన్నారు. రాజధాని నిర్మాణం, డిజైన్లలో రైతుల అభిప్రాయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు రాజధాని పనులు జరగకపోయినా అంచనాలు మాత్రం లక్షల కోట్లకు చేరుతున్నాయని తెలిపారు.

అభివృద్ధి పేరుతో తీర ప్రాంతంలో మత్య్సకారుల పొట్ట కొట్టొద్దు: సిపిఎం - Tholi Paluku