Let's talk: editor@tmv.in
అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి: ఏపీ ఉప ముఖ్యమంత్రి

అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి: ఏపీ ఉప ముఖ్యమంత్రి

Panthagani Anusha
10 ఏప్రిల్, 2026

పవిత్ర పుణ్యక్షేత్రమైన అంతర్వేది అభివృద్ధి, ఆధ్యాత్మికత కలబోతగా వర్థిల్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో గురువారం వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సుస్థిరమైన మార్పును తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

30 ఏళ్ల తాగునీటి కష్టాలకు విముక్తి

అంతర్వేది ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల తాగునీటి కష్టాలకు పరిష్కారం చూపుతూ రూ.17.33 కోట్ల వ్యయంతో నిర్మించి న సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్వేది దేవస్థానంతో పాటు అంతర్వేది, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలోని 13 గ్రామాల ప్రజలకు, సుమారు 30 వేల మందికి లబ్ధి చేకూరనుంది. గతంలో 12 కిలోమీటర్ల దూరం నుండి నీటిని తరలించాల్సి వచ్చేదని ఇప్పుడు 10 ఎకరాల చెరువు అభివృద్ధి 3 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన శుద్ధి కేంద్రం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన జలం అందుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా గన్నవరం కాలువ నుండి పంపింగ్ ద్వారా నీటిని నిల్వ చేసి సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

రూ.5 కోట్లతో మరో భారీ ప్లాంట్

తాగునీటి సౌకర్యాల విస్తరణలో భాగంగా ఒఎన్జీ, సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.5 కోట్లతో గుడిమెల్లంక వద్ద నిర్మించనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ ప్లాంట్ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 29 గ్రామాల్లోని 1.20 లక్షల మంది జనాభాకు తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు వినియోగానికి అనుకూలంగా లేని దృష్ట్యా ఇలాంటి ప్రాజెక్టులు ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలు స్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

జల్ జీవన్ మిషన్ లక్ష్యమే ఊపిరిగా

కేంద్ర ప్రభుత్వ 'జల్ జీవన్ మిషన్' లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా సురక్షిత నీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.