
అభయ్, అనాహత్‌కు ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్స్
భారత స్క్వాష్ సంచలనాలు అభయ్ సింగ్, అనాహత్ సింగ్ జేఎస్‌డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ 2026లో తమ ఆధిపత్యాన్ని చాటారు. ఆదివారం ముంబైలోని సీసీఐ కోర్టులో జరిగిన పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శనతో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. స్థానిక అభిమానుల కేరింతల మధ్య జరిగిన ఈ పోరులో అభయ్ తన స్వదేశీ ప్రత్యర్థిపై గెలవగా, అనాహత్ ఈజిప్టు క్రీడాకారిణిని చిత్తు చేసి వరుసగా రెండో ఏడాది చాంపియన్‌గా నిలిచింది.
ఏకపక్షంగా పురుషుల ఫైనల్
పురుషుల సింగిల్స్ టైటిల్ పోరు పూర్తిగా భారతీయుల మధ్యే సాగింది. రెండో సీడ్ అభయ్ సింగ్, నాలుగో సీడ్ వీర్ చోట్రాని మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అభయ్ 3-0 (11-9, 11-8, 11-4)తో వరుస గేముల్లో విజయం సాధించాడు. తొలి రెండు గేముల్లో వీర్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో అభయ్ తన అనుభవాన్నంతా ఉపయోగించి పాయింట్లు సాధించాడు. ముఖ్యంగా మూడో గేమ్‌లో అభయ్ కొట్టిన పవర్‌ఫుల్ స్మాష్‌లు, డెసెప్టివ్ యాంగిల్స్‌ను అర్థం చేసుకోవడంలో వీర్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో ఏకపక్షంగా సాగిన చివరి గేమ్‌ను గెలుచుకుని అభయ్ ట్రోఫీని ముద్దాడాడు.
అనాహత్ ‘డబుల్’ ధమాకా
మహిళల విభాగంలో అగ్రశ్రేణి క్రీడాకారిణి అనాహత్ సింగ్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో ఈజిప్టుకు చెందిన రెండో సీడ్ హనా మోతాజ్‌పై 3-1 (11-5, 11-6, 9-11, 11-6) తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి రెండు గేముల్లో అద్భుతమైన వేగంతో క్రాస్-కోర్ట్ మూవ్‌మెంట్స్‌తో హనాను ఉక్కిరిబిక్కిరి చేసిన అనాహత్.. వరుసగా 11-5, 11-6తో ముందంజ వేసింది. అయితే మూడో గేమ్‌లో పుంజుకున్న ఈజిప్షియన్ ప్లేయర్ 11-9తో అనాహత్‌కు షాకిచ్చింది. కానీ నాలుగో గేమ్‌లో మళ్లీ ఫామ్ అందుకున్న అనాహత్, కోచ్ సూచనలతో ఏకాగ్రత కోల్పోకుండా 11-6తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
ఏకాగ్రతే విజయ రహస్యం: అనాహత్
విజయం అనంతరం అనాహత్ మాట్లాడుతూ.. "వరుసగా రెండో ఏడాది టైటిల్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. మూడో గేమ్‌లో కాస్త ఫామ్ తప్పాను, కానీ కోచ్ సూచనలతో నాలుగో గేమ్‌లో మళ్లీ పుంజుకున్నాను. నేను త్వరగా ఏకాగ్రత కోల్పోతుంటాను, అందుకే ప్రతి పాయింట్ వద్ద నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఆడాను. హనా అనారోగ్యంతో ఉండి కూడా ఇంత గొప్పగా పోరాడటం అభినందనీయం" అని పేర్కొంది. ఈ టోర్నీ విజయంతో భారత స్క్వాష్ రంగంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు.
