
అబ్బో..ఆయన లీలలు అన్నీ ఇన్నీ కావు!?
బాలికల లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన చైతన్యానంద సరస్వతికి సంబంధించిన రెండు పిటిషన్లపై ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టులో తమ సమాధానాన్ని దాఖలు చేశారు. జైలులో తనకు సన్యాసి ఆహారం (సన్యాసి ఫుడ్), 'సన్యాసి వస్త్రాలు' (సన్యాసి గార్బ్), కళ్లద్దాలు, మందులు, పుస్తకాలు అందించాలని కోరుతూ చైతన్యానంద సరస్వతి ఈ దరఖాస్తులను దాఖలు చేశారు. ఈ కేసులో అదనంగా కేసు వివరాలను స్వాధీనం చేసుకున్న'సీజర్ మెమో' కాపీని తనకు అందించాలని కోరుతూ కూడా ఆయన మరో దరఖాస్తును దాఖలు చేశారు. ఈ దరఖాస్తులపై జుడిషియల్ మేజిస్ట్రేట్ప పల్లవి త్యాగి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేశారు. సన్యాసి ఆహారం, మందులు అందించాలని అంతకుముందు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది.
అయిదు రోజుల కస్టడీ
ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు చైతన్యానంద సరస్వతిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. 5 రోజుల పోలీసు కస్టడీ ముగిసిన అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఒక విద్యా సంస్థలో దాదాపు 17 మంది బాలికలను ఆయన లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. చైతన్యానంద తరపు సీనియర్ న్యాయవాది అజయ్ బర్మన్, న్యాయవాది మనీష్ గాంధీ తమ క్లయింట్‌కు కళ్లద్దాలు, పవిత్ర గ్రంథాలు, జ్యుడీషియల్ కస్టడీలో సన్యాసి ఆహారం అందించేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు.
విచారణ సందర్భంగా ఎఫ్ఐఆర్ లో కొత్త సెక్షన్ ఎందుకు చేర్చారని బాబా తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ విషయంపై దర్యాప్తు అధికారి స్పందిస్తూ నిందితుడి సూచన మేరకు ఒక వ్యక్తి బెదిరించినట్లు ఫిర్యాదు రావడంతో బెదిరింపు నేరం కింద కొత్త సెక్షన్‌ను చేర్చినట్లు కోర్టుకు తెలిపారు. చైతన్యానంద పిటిషన్లపై స్పందన ఇవ్వాలని కోర్టు మొదట ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. కేసు డైరీపై న్యాయమూర్తి సంతకం చేయాలనే దరఖాస్తును కోర్టు అనుమతించింది. బాలికలపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు జైలులో ప్రత్యేక వసతులు కోరడంపై న్యాయ వర్గాల్లో, ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ పిటిషన్లపై కోర్టు అక్టోబర్ 8న తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
అసభ్యకరంగా చాటింగ్
స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఢిల్లీలోని శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి (ఢిల్లీ బాబా)పై 17 మంది విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది. 62 ఏళ్ల వయసులోనూ ఆ బాబా ప్రదర్శించిన లీలలు అన్నీఇన్నీ కాదని అతడి వాట్సాప్ చాటింగ్ ద్వారా పోలీసులు గుర్తించారు. విద్యార్థులు, సిబ్బంది అనుమతి లేకుండా స్వామి చైతన్యానంద సరస్వతి రహస్యంగా వారి ఫొటోలను తీసినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి రికవరీ చేశారు. ఆ బాబా ఫోన్‌లో చాలా మంది యువతుల ప్రొఫైల్ ఫొటోలు ఉన్నట్లు కనుగొన్నారు. స్వామి చైతన్యానంద సరస్వతి తన చాట్‌లలో విద్యార్థినులు, మహిళా సిబ్బందిని బేబీ, డాటర్ డాల్ అని పిలిచాడు. నాతో కలిసి నిద్రించాలి అని ఒత్తిడి చేసినట్లు వాటి ద్వారా తేలింది. ఒక చాట్‌లో ఓ విద్యార్థినిని దుబాయ్ షేక్‌తో పడుకో అని ఆదేశించినట్లు తెలుస్తోంది. రాజకీయ పరిచయాలను ఉపయోగించుకొని ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కూడా అమ్మాయిలను అతడు ఆకర్షించాడని సమాచారం.
ఆశ్రమమే వేధింపుల గది
ఆశ్రమం గ్రౌండ్ ఫ్లోర్‌లోని కార్యాలయాన్ని వేధింపుల గదిగా ఉపయోగించి చాలా మంది అమ్మాయిలను స్వామి చైతన్యానంద సరస్వతి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పకుండా, అలాగే వారు ఆశ్రమం వదిలి వెళ్లకుండా స్వామి చైతన్యానంద సరస్వతి చేశాడు. విద్యార్థినుల ఒరిజినల్ సర్టిఫికేట్‌లను అతడి వద్దే ఉంచుకుని వారికి ఇవ్వబోనని బెదిరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులు ఆ ఆశ్రమ నిర్వాహకుడిని వసంత కుంజ్ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకెళ్లి అక్కడి ప్రైవేట్ కార్యాలయం, నివాసం, మహిళా విద్యార్థులను వేధించిన గదిని చూపించాలని అడిగారు. ఈ ఇన్‌స్టిట్యూట్ శృంగేరి శారదా పీఠం నిర్వహణలో ఉంది.
ఆధ్యాత్మిక యాత్ర పేరిట
స్వామి చైతన్యానంద సరస్వతికి గతంలో స్వామి పార్ధసారథిగానూ పేరు ఉంది. ఇతడు ఇన్‌స్టిట్యూట్‌లో పని చేసిన మహిళా సిబ్బందిని ఉపయోగించుకుని ఈడబ్ల్యూఎస్ స్కాలర్‌షిప్ కింద చదువుతున్న విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని తెలుస్తోంది.స్వామి చైతన్యానంద సరస్వతి లండన్ నంబర్‌లతో వాట్సాప్ ఉపయోగించి ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఐపీ అడ్రస్ ద్వారా కనుగొని ఆగస్టు 28న ఉదయం 3.30 గంటలకు ఆగ్రాలోని ఒక హోటల్‌లో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతని ఫోన్‌లో చాలా మంది మహిళలతో చేసిన చాట్‌లు దొరికాయి. విచారణలో, బాధితులను ఆధ్యాత్మిక యాత్ర పేరిట ఆల్మోరా, రుషికేశ్‌లకు తీసుకెళ్లినట్లు స్వామి చైతన్యానంద సరస్వతి అంగీకరించాడు. అయితే తిరిగి ప్రయాణంలో వారిపై లైంగిక దాడులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
