
అబూ సలీంకు రెండు రోజుల పెరోల్ మాత్రమే ఇవ్వగలం: మహారాష్ట్ర
1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన గ్యాంగ్‌స్టర్ అబూ సలీం ఒక అంతర్జాతీయ నేరస్థుడు కావడంతో అతడికి కేవలం రెండు రోజుల అత్యవసర పెరోల్ మాత్రమే ఇవ్వగలమని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బాంబే హైకోర్టుకు తెలిపింది. ఆ పెరోల్ కూడా పోలీసు ఎస్కార్ట్‌తోనే ఉంటుందని స్పష్టం చేసింది. తన పెద్ద అన్న అబూ హకీమ్ అన్సారీ గత ఏడాది నవంబర్‌లో మృతి చెందడంతో, 14 రోజుల పెరోల్ ఇవ్వాలని అబూ సలీం హైకోర్టును ఆశ్రయించాడు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంఖువార్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ, అబూ సలీం అంతర్జాతీయ నేరస్థుడు కావడంతో 14 రోజుల పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టుకు వివరించారు. జైలు అధికారులు రెండు రోజుల పెరోల్‌కు మాత్రమే అంగీకరించారని, ఆ సమయంలో పోలీసు ఎస్కార్ట్ తప్పనిసరి అని తెలిపారు. పోలీసు భద్రతకు అయ్యే ఖర్చును అబూ సలీమే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వ వాదన.
దీనికి కౌంటర్ గా అబూ సలీం తరఫు న్యాయవాది ఫర్హానా షా వాదిస్తూ, ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌కు వెళ్లి తిరిగి రావడానికి రెండు రోజులు సరిపోవని అన్నారు. అంతేకాదు అబూ సలీం గత రెండు దశాబ్దాలుగా జైలులోనే ఉన్నాడని, అత్యవసర పెరోల్ కోసం పోలీసు ఎస్కార్ట్ అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అబూ సలీం భారత పౌరుడేనని కూడా ఆమె గుర్తు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు అజయ్ గడ్కరీ, శ్యామ్ చందక్‌లతో కూడిన ధర్మాసనం, అబూ సలీంకు 14 రోజుల పెరోల్ ఇవ్వడంపై ప్రభుత్వానికి ఉన్న భద్రతా ఆందోళనలను వివరించే అఫిడవిట్‌ను దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారం వాయిదా వేసింది.
డిసెంబర్ 2025లో దాఖలు చేసిన తన పిటిషన్‌లో, అన్న మరణంతో నవంబర్ 15న చివరి కర్మలు, సంబంధిత కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అత్యవసర 14 రోజుల పెరోల్ కోసం జైలు అధికారులను సంప్రదించానని అబూ సలీం పేర్కొన్నాడు. అయితే నవంబర్ 20, 2025న జైలు అధికారులు తన అభ్యర్థనను తిరస్కరించారని తెలిపాడు. 2005 నవంబర్‌లో తన అరెస్ట్ అనంతరం ఇప్పటివరకు జైలులోనే ఉన్నానని, తల్లి, సవతి తల్లి మృతి చెందిన సందర్భాల్లో మాత్రమే కొన్ని రోజుల పెరోల్ లభించిందని అబూ సలీం తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
అబూ సలీం కేసు
1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అబూ సలీం ఒకప్పుడు దావూద్ ఇబ్రాహీం గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా పనిచేశాడు. ఆయుధాల సరఫరా, సుపారి హత్యలు, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించిన ఆరోపణలపై అతడిపై 20కిపైగా కేసులు నమోదయ్యాయి. 1997లో బాలీవుడ్ నిర్మాత గుల్షన్‌కుమార్ హత్య కేసులోనూ అబూ సలీం దోషిగా తేలి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. 2005లో పోర్చుగల్‌లో అరెస్టైన అతడిని, మరణశిక్ష విధించబోమనే హామీతో భారత్‌కు తీసుకొచ్చారు.
అంతర్జాతీయ అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్న కారణంగా అతడిని అంతర్జాతీయ నేరస్థుడిగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ప్రస్తుతం 2005 నుంచి జైలులోనే ఉన్న అబూ సలీం, అన్న మృతి కారణంగా 14 రోజుల పెరోల్ కోరగా, భద్రతా కారణాలతో ప్రభుత్వం కేవలం రెండు రోజుల పెరోల్‌కే అంగీకరించింది.
