
అబుదాబిలో ఐపీఎల్ 2026 వేలం, ఎప్పటినుంచంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాట డిసెంబర్ మధ్యలో అబుదాబిలో జరుగుతుందని బీసీసీఐ అధికారి ఒకరు మంగళవారం పీటీఐకి తెలిపారు. ఐపీఎల్ వేలం వేదికగా అబుదాబిని ఖరారు చేసినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. ఈ వేలం డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. వరుసగా ఇది మూడోసారి విదేశాల్లో జరగనుంది. గతంలో దుబాయ్ (2023), జెడ్డా (2024)లలో వేలం నిర్వహించారు. గత ఏడాది సౌదీ అరేబియాలో జరిగిన మెగా వేలం తర్వాత, ఇది మినీ వేలం కానుంది.
ఐపీఎల్ లోని 10 జట్లు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి గడువు నవంబర్ 15. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక సంచలన ట్రేడ్ చివరి దశకు చేరుకుంది. దీనిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అదేమిటంటే.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ ద్వారా తీసుకుంటుంది. దీనికి బదులుగా, సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు పంపుతుంది.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ సంజు శాంసన్‌ను ట్రేడ్ చేయడానికి పలు జట్లతో చర్చలు జరిపింది. మొదట, ఢిల్లీ క్యాపిటల్స్‌తో సంజు శాంసన్ తరలింపుపై చర్చలు జరిగాయి, కానీ ఆ చర్చలు ఆకస్మికంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బృందం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, ఈ కీలక ఒప్పందాన్ని ఖరారు చేసింది.
ఎంఎస్ ధోని రిటైర్మెంట్ తర్వాత జట్టును నడిపించగల సమర్థుడైన భవిష్యత్తు కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అవసరం సీఎస్‌కేకు ఉంది. శాంసన్ ఆ పాత్రకు సరిపోతాడు. అలాగే ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్ అయిన రవీంద్ర జడేజా రాకతో, రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్, స్పిన్ బౌలింగ్ విభాగం బలోపేతం అవుతుంది. జడేజా ఐపీఎల్ కెరీర్ 2008లో రాజస్థాన్ రాయల్స్ నుంచే మొదలైంది.
నవంబర్ 27న డబ్ల్యూపీఎల్ వేలం
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విషయానికొస్తే, వేలం నవంబర్ 27న ఢిల్లీలో జరగనుంది. ఫ్రాంఛైజీలు ఇప్పటికే తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న జాబితాను ప్రకటించాయి. ఈ నెల చివర్లో వేలంలో తుది స్క్వాడ్‌లను ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
డబ్ల్యూపీఎల్ జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
ఢిల్లీ క్యాపిటల్స్:
జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, అన్నబెల్ సదర్లాండ్ (విదేశీ క్రీడాకారిణి), మరిజానే కాప్ (విదేశీ క్రీడాకారిణి), నికి ప్రసాద్; గుజరాత్ జెయింట్స్: యాష్లీ గార్డ్‌నర్ (విదేశీ క్రీడాకారిణి), బెత్ మూనీ (విదేశీ క్రీడాకారిణి); ముంబై ఇండియన్స్: నటాలీ సైవర్ (విదేశీ క్రీడాకారిణి), హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్ (విదేశీ క్రీడాకారిణి), అమన్‌జోత్ కౌర్, జి కమలిని; రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ (విదేశీ క్రీడాకారిణి), శ్రేయాంక పాటిల్; యూపీ వారియర్జ్: శ్వేతా సెహ్రావత్
