Let's talk: editor@tmv.in
అబ్బో ఈమె సామాన్యురాలు కాదు

అబ్బో ఈమె సామాన్యురాలు కాదు

T Venkata Ramana
17 సెప్టెంబర్, 2025

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన ఒక అధికారి, అక్రమాస్తుల కూడబెట్టుకుని ఏకంగా ఒక కోటనే నిర్మించుకుంటే? ఈ ప్రశ్న అస్సాంలో వెలుగు చూసిన ఒక సంచలనాత్మక సంఘటనతో నిజమైంది. ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ నిర్వహించిన దాడుల్లో అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నూపుర్ బోరా అవినీతి లీలలు కళ్లకు కట్టినట్లు బయటపడ్డాయి. ఆరు సంవత్సరాల సర్వీసులోనే రూ.2 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టుకున్న ఆమె నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

డబ్బుల కట్టలు

గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా నూపుర్ బోరాపై నిఘా పెట్టారు. ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభమైంది. విజిలెన్స్ బృందం నూపుర్ బోరా నివాసంతో పాటు, ఆమెకు చెందిన ఇతర మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. గౌహతిలోని గోతానగర్ ప్రాంతంలో ఆమెకు చెందిన రెండు అపార్ట్మెంట్లపై దాడులు జరిపారు. అధికారులు లోపలికి ప్రవేశించగానే వారి కళ్లు చెదిరిపోయాయి. ఇంట్లో రెండు పెద్ద బ్యాగుల నిండా కరెన్సీ కట్టలు, వందల గ్రాముల బంగారు ఆభరణాలు, వజ్రాలు కనిపించాయి. లెక్కించగా రూ.1 కోటి నగదుతో పాటు మరో రూ.1 కోటి విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దృశ్యం అధికారులనే విస్మయానికి గురి చేసింది. నోట్ల కట్టలతో ఉన్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

అసలు కుంభకోణం

నూపుర్ బోరా అవినీతి బాగోతం వెనుక ప్రధానంగా ఒక భూ కుంభకోణం ఉన్నట్లు విచారణలో తేలింది. ఆమె బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకుంది. ముఖ్యంగా హిందువుల భూములను అక్రమంగా మరొక వర్గానికి బదిలీ చేయడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ వలసదారులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్లో కూడా ఆమె ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

సహాయకుడు అరెస్టు

నూపుర్ బోరాతో పాటు ఆమెకు సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురాజిత్ డేకా నివాసంలో కూడా సోదాలు జరిగాయి. సురాజిత్పై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉండటంతో పోలీసులు అతడిని కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులు కలిసి ఒక వ్యవస్థీకృత నేర బృందంగా పనిచేసి అక్రమ భూ బదిలీలకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.

నూపుర్ బోరాపై ఇంకా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తు పూర్తయితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అస్సాంలో అవినీతిని అంతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవినీతిపరులు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.

అబ్బో ఈమె సామాన్యురాలు కాదు - Tholi Paluku