
అఫ్గాన్ ప్రతీకార దాడులు.. దద్దరిల్లిన పాక్ సరిహద్దులు
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ జ్వాలలు మిన్నంటుతున్నాయి. గత ఐదు రోజులుగా 2,600 కిలోమీటర్ల పొడవైన 'డ్యూరాండ్ లైన్' వెంబడి ఇరు దేశాల దళాల మధ్య పోరు మంగళవారం నాటికి మరింత ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల తమ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా పాక్ వైమానిక దళం జరిపిన మెరుపు దాడులకు ప్రతీకారంగా అఫ్గాన్ దళాలు శక్తివంతమైన ఎదురుదాడిని ప్రారంభించాయి. ఈ భీకర పోరులో పాకిస్థాన్‌కు చెందిన పలు కీలక సైనిక పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
రంగంలోకి వైమానిక దళాలు.. పోస్టుల స్వాధీనం
అఫ్గాన్ దళాలు జరిపిన ఎదురుదాడులతో సరిహద్దుల్లో పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ కకావికలమైంది. మంగళవారం అఫ్గాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పోరులో వారి సైన్యం పూర్తిగా పైచేయి సాధించింది. ముఖ్యంగా కాందహార్ ప్రాంతంలోని స్పిన్ బోల్డాక్, షోరాబక్ జిల్లాల్లో ఉన్న పాక్ సైనిక స్థావరాలను అఫ్గాన్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. స్పిన్ బోల్డాక్‌లో మూడు సైనిక కేంద్రాలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు పాక్ సైనికులను హతమార్చడమే కాకుండా మరొకరిని బందీగా పట్టుకున్నారు. అదేవిధంగా ఖోస్త్ ప్రాంతంలోని అలీ-షేర్ జిల్లాలో మరో రెండు పాక్ సైనిక పోస్టులను కూడా అఫ్గాన్ దళాలు ఆక్రమించాయి.
భారీ ప్రాణ నష్టం
అఫ్గానిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖోరాజ్మీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భీకర పోరులో పాకిస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. పాక్ వైపు సుమారు 150 మంది సైనికులు మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. వారి రక్షణకు సంబంధించిన 35 నుంచి 49 సైనిక స్థావరాలను అఫ్గాన్ దళాలు ధ్వంసం చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. పక్తికా ప్రావిన్స్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న పాక్ సాయుధ ట్యాంకును అఫ్గాన్ బలగాలు పేల్చివేయగా, బాఘ్రామ్ ఎయిర్ బేస్‌పై దాడికి ప్రయత్నించిన పాక్ యుద్ధ విమానాలను గాలిలోనే సమర్థంగా తిప్పికొట్టాయి. ఇక అఫ్గాన్ సైన్యం వైపు చూస్తే, ఇప్పటివరకు 27 మంది జవాన్లు వీరమరణం పొందగా, మరో 42 మంది గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్ ఎదురుదాడి
అఫ్గాన్ దాడులను పాక్ గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఖోస్త్, జలాలాబాద్‌లలోని ఆయుధ గిడ్డంగులు, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా తాము దాడులు చేస్తున్నట్లు పాక్ వర్గాలు ధ్రువీకరించాయి. పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ.. తాము 435 మంది అఫ్గాన్ సైనికులను హతమార్చామని, 188 ట్యాంకులు, యుద్ధ వాహనాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. 51 ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించి 31 పోస్టులను ఆక్రమించుకున్నామని పాక్ పేర్కొంది. అయితే ఇరు దేశాలు చెబుతున్న గణాంకాలలో భారీ వ్యత్యాసాలు ఉండటంతో అసలు నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది.
ముగింపు లేని వివాదం
పాకిస్థాన్‌లో అలజడి సృష్టిస్తున్న టెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందన్నదే పాక్ ప్రధాన ఆరోపణ. అయితే తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు అనుమతించడం లేదని అఫ్గాన్ స్పష్టం చేస్తోంది. అఫ్గాన్ గడ్డను పాక్ వ్యతిరేక కార్యకలాపాలకు వాడకుండా చూడటమే తమ ఏకైక డిమాండ్ అని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఖతార్ వంటి దేశాలు చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోంది.
