
అఫ్గాన్‌లో మహిళా సిబ్బందిపై ఆంక్షలు: సరిహద్దు సేవలను నిలిపివేసిన ఐరాస
అఫ్గానిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యుఎన్ఏఎంఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. హెరాత్ ప్రావిన్స్‌లోని ఇస్లాం ఖలా సరిహద్దు వద్ద వలసదారుల కోసం అందిస్తున్న తన సేవలను యుఎన్ఏఎంఏ తాత్కాలికంగా నిలిపివేసినట్లు టోలో న్యూస్ నివేదించింది. ఈ సరిహద్దు క్రాసింగ్ వద్ద తమ మహిళా సిబ్బంది పనిచేయకుండా ఆంక్షలు విధించడమే సేవలను నిలిపివేయడానికి ప్రధాన కారణంగా యుఎన్ఏఎంఏ పేర్కొంది.
ఇరాన్ నుండి తిరిగి వస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారని యుఎన్ఏఎంఏ తెలిపింది. మహిళా సిబ్బంది లేకుండా, తిరిగి వస్తున్న వారికి అవసరమైన సేవలను అందించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమితి కూడా ఈ విషయం పై స్పందించింది. “ఇస్లామ్ ఖాలా సరిహద్దు వద్ద తిరిగి వస్తున్న వారి లో 60 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలు. తిరిగి వస్తున్న ప్రతి పది కుటుంబాల్లో మూడు కుటుంబాలకు మహిళలే పెద్దగా ఉన్నారు. మహిళా సిబ్బంది లేకుండా మేము వారిని గౌరవప్రదంగా, సమానంగా సేవలందించలేము.” అని పేర్కొంది.
మరోవైపు ఇరాన్ నుండి బహిష్కరించబడిన కొందరు ఆఫ్గాన్ వలసదారులు తీవ్రమైన ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా సహాయం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని వారు కోరారు. ఇరాన్ నుండి బహిష్కరించబడిన అబ్దుల్ రసూల్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు వలసదారుల సమస్యపై ఎలాంటి శ్రద్ధ చూపలేదు. ఎటువంటి సహాయం అందలేదు. శీతాకాలం దగ్గరపడుతోంది. అయినా మాకు ఎవరూ సహాయం చేయడం లేదు” అని తెలిపారు. మరో వలసదారుడు మొహమ్మద్ రేజా మాట్లాడుతూ, “మా పేర్లు నమోదు చేసి ఐదు ఆరు నెలలు అవుతున్నాయి, కానీ ఇప్పటివరకు ఏ సహాయం అందలేదు” అని అన్నారు.
కొందరు పౌరులు, పౌర సమాజ కార్యకర్తలు మానవతా సహాయాన్ని రాజకీయం చేయకూడదని నొక్కి చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, ఇరాన్ నుండి తిరిగి వచ్చిన ఆఫ్ఘన్లకు తక్షణ సహాయం అవసరం ఉంది. కాబట్టి ఐక్యరాజ్యసమితి, ఇతర మానవతా సంస్థల సహాయం తక్షణమే ఇస్లామ్ ఖాలా సరిహద్దులో పునరుద్ధరించాలి
సివిల్ సొసైటీ కార్యకర్త సయ్యద్ అష్రఫ్ సాదాత్ మాట్లాడుతూ, “రిలీఫ్ ఏజెన్సీలు ఇస్లామ్ ఖాలా సరిహద్దులో తిరిగి వచ్చిన వలసదారుల పునరావాస ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. మొదటి దశలో రవాణా, ఆహారం వంటి అవసరాలను తీర్చడంలో అవి సహాయపడగలవు. వారి సేవలను నిలిపివేయడం వలసదారుల పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది” అని అన్నారు. ఇటీవలి నెలల్లో, ఇస్లామ్ ఖాలా సరిహద్దు ద్వారా సుమారు 12 లక్షల అఫ్గాన్ వలసదారులు ఇరాన్ నుండి తిరిగి వచ్చారు.
ఆఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం మహిళల ఉద్యోగాలపై దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే హెరాత్ ప్రావిన్స్‌లోని ఇస్లాం ఖలా సరిహద్దు వద్ద పనిచేసే యుఎన్ మహిళా సిబ్బందికి వర్క్ పర్మిట్లు ఇవ్వలేదు. తాలిబాన్ నిబంధనల ప్రకారం, మహిళలు పురుషులతో కలిసి పనిచేయకూడదు అనే నియమం కారణంగా ఈ పరిమితులు అమలయ్యాయి.
