
అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు.. ఐరాసలో భారత్ మండిపాటు
అఫ్గానిస్థాన్ గడ్డపై పాకిస్థాన్ జరుపుతున్న వైమానిక దాడులను భారత్ తీవ్రస్థాయిలో ఖండించింది. పొరుగు దేశపు సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న పాక్ తీరుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ నిప్పులు చెరిగింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని మాట్లాడుతూ.. పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.
పవిత్ర మాసంలో పౌరుల బలి
ఒకవైపు అంతర్జాతీయ చట్టాలు, ఇస్లామిక్ సంఘీభావం గురించి గొప్పలు చెబుతూనే.. మరోవైపు పవిత్ర రంజాన్ మాసంలో పాకిస్థాన్ కనికరం లేకుండా వైమానిక దాడులకు తెగబడటం అత్యంత హేయమైన చర్య అని హరీష్ పర్వతనేని మండిపడ్డారు. మార్చి 6వ తేదీ నాటికి ఈ దాడుల్లో 185 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, వారిలో 55 శాతం మంది మహిళలు, పిల్లలే ఉండటం పాక్ క్రూరత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారని ‘యునామా’ గణాంకాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
వాణిజ్య ఉగ్రవాదంపై ఆందోళన
అఫ్గానిస్థాన్ వంటి సముద్ర తీరం లేని దేశాన్ని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. వాణిజ్య మార్గాలను మూసివేయడం, రవాణాకు ఆటంకాలు సృష్టించడం వంటి చర్యలను ‘ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ టెర్రరిజం’గా అభివర్ణించారు. సముద్ర తీరం లేని దేశాల హక్కుల గురించి ఐరాస చేస్తున్న ప్రకటనలు ఇలాంటి చర్యల ముందు వెలవెలబోతున్నాయని, వాణిజ్య బలహీనతలను ఆయుధాలుగా మార్చుకోవడం సరికాదని హితవు పలికారు.
ఉగ్రవాద స్థావరాలపై ఉక్కుపాదం
అఫ్గాన్ గడ్డపై ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న భారత్.. ఐసిస్, అల్ ఖైదాతో పాటు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, వాటి అనుబంధ సంస్థలైన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ వంటి ముఠాల ఏరివేతకు ప్రపంచ దేశాలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దు ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అఫ్గాన్‌పై విధిస్తున్న ఆంక్షలు ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని సూచించారు.
అఫ్గాన్ అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉంది
ఇన్ని కష్టాల్లోనూ అఫ్గాన్ యువత క్రికెట్ పట్ల చూపిస్తున్న ఉత్సాహం అభినందనీయమని హరీష్ పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అఫ్గాన్ జట్టు ప్రదర్శన గర్వకారణమని, వారి ప్రయాణంలో భారత్ భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. అఫ్గాన్ సార్వభౌమాధికారానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని, 500కు పైగా అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆ దేశ ప్రజలకు మానవతా దృక్పథంతో అండగా ఉంటామని పునరుద్ఘాటించారు.
