
అఫ్గాన్‌కు భారత్ ఆపన్న హస్తం
ప్రకృతి వైపరీత్యాలతో చిక్కుకుపోయిన అఫ్గానిస్థాన్‌ను ఆదుకునేందుకు భారత్ మరోసారి ముందుకొచ్చింది. వరుస భూకంపాలు, భారీ వరదలతో అతలాకుతలమైన ఆ దేశానికి భారత్ భారీ ఎత్తున మానవతా సాయాన్ని అందజేసింది. ఈ కష్టకాలంలో అఫ్గాన్ ప్రజలకు అండగా ఉంటామని, మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. బాధితుల కోసం కిచెన్ సెట్లు, హైజీన్ కిట్లు, ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగులు వంటి అత్యవసర వస్తువులను భారత్ పంపిణీ చేసింది.
ప్రకృతి ప్రకోపం: 35 మంది మృతి
అఫ్గానిస్థాన్‌లోని 25 ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల మృతుల సంఖ్య 35కు చేరిందని, మరో 52 మంది గాయపడ్డారని అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి. నేషనల్ డిజార్డర్ మేనేజ్మెంట్ అథారిటీ గణాంకాల ప్రకారం.. వరదల ధాటికి 131 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 650 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 3,000 జెరీబ్‌ల వ్యవసాయ భూమిలో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరద నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
భూకంపం మిగిల్చిన విషాదం
మరోవైపు ఏప్రిల్ 3న దేశంలోని పలు ప్రావిన్సుల్లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని నింపింది. కాబూల్, పంజ్‌షీర్, లోగర్, నంగర్హర్ వంటి ప్రాంతాల్లో భూ ప్రకంపనల ధాటికి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కాబూల్ ప్రావిన్సులోని గోస్ఫండ్ దారా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఇల్లు కూలి మరణించడం స్థానికులను కలచివేసింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం 186 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
నిరాశ్రయులైన బాధితుల ఆవేదన
వరదలు తమ సర్వస్వాన్ని తుడిచిపెట్టేశాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "నీరు ఇళ్లలోకి రావడంతో మా పిల్లల కోసం బయట చిన్న షెల్టర్ వేసుకున్నాం, కానీ అది ఏమాత్రం సరిపోవడం లేదు" అని స్థానిక నివాసి అబ్దుల్ రజాక్ వాపోయారు. భారీ వర్షాల వల్ల బావులు, పశువుల పాకలు కొట్టుకుపోయాయని, తక్షణమే ప్రభుత్వం నీటి కాల్వలను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు. వర్షాలు నిరంతరాయంగా కురుస్తుండటంతో సురక్షితమైన ఆశ్రయం లేక వేలాది మంది ప్రజలు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు.
ముమ్మరంగా సహాయక చర్యలు
విపత్తు నిర్వహణ సంస్థలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశాయి. అనేక ప్రావిన్సుల్లో చిక్కుకుపోయిన వారిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయని అధికార ప్రతినిధి మొహమ్మద్ యూసుఫ్ హమద్ తెలిపారు. బాధితులకు అత్యవసర సాయం పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. యూరేషియన్, ఇండియన్ ప్లేట్ల సంగమ ప్రాంతంలో ఉన్న హిందూకుష్ రీజియన్ వల్ల అఫ్గానిస్థాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయని, సగటున ఏడాదికి 560 మంది వీటి వల్ల మరణిస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
