
అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వానికి కట్టుబడి ఉన్నాం: భారత్
అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణలు, ఉద్రిక్తతలపై భారత్ తన స్పష్టతన వైఖరిని ప్రకటించింది. అఫ్గానిస్థాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రానికి తాము కట్టుబడి ఉన్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పొరుగు దేశమైన పాకిస్థాన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
పాకిస్థాన్ వ్యవహార శైలిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదం కొనసాగింపును తమ హక్కుగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, ‘‘అఫ్గానిస్థాన్ తన సొంత భూభాగాన్ని పాలించుకోవడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని యథేచ్ఛగా కొనసాగించే హక్కు ఉందని పాక్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చర్యలను పొరుగు దేశాలు అంగీకరించవు. అఫ్గాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్య్రానికి భారత్ కట్టుబడి ఉంది’’ అని ఉద్ఘాటించారు.
ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘాన్ భూభాగంలో వైమానిక దాడులు జరిపిందన్న ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అక్టోబర్ ప్రారంభంలో జరిగిన ఈ ఘటనలు, సరిహద్దు కాల్పులు, ఉగ్రవాద కార్యకలాపాలు ఇరు దేశాల మధ్య శాంతి వాతావరణాన్ని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో టర్కీ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్-ఆఫ్ఘాన్ ప్రభుత్వాలు చర్చలకు కూర్చుకున్నప్పటికీ, అవి విఫలమయ్యాయి. సరిహద్దు భద్రత, ఉగ్రవాద నియంత్రణ, శాంతి ఏర్పాటుపై ఎటువంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు.
చర్చలు విఫలం అవ్వడంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “తాలిబన్లు భారత్ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. అఫ్గాన్ చర్చలు విఫలమవ్వడానికి భారత్ కారణం” అని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అఫ్గానిస్థాన్ అంతర్గత విషయాలపై తాము జోక్యం చేసుకోవడం లేదని, ఆ దేశ స్వాతంత్య్రానికే మద్దతిస్తున్నామని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ తన ఉగ్రవాద విధానాలను కప్పిపుచ్చుకోవడానికి నిరాధార ఆరోపణలు చేస్తోందని విదేశాంగ శాఖ పరోక్షంగా స్పష్టం చేసింది.
తాలిబన్లు, పాకిస్తాన్ మధ్య సమస్యల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ తన ఉగ్రవాద విధానాలను కప్పిపుచ్చుకోవడానికి నిరాధార ఆరోపణలు చేస్తోందని పరోక్షంగా స్పష్టం చేసింది.
భారత విదేశాంగశాఖ ప్రకటనలో, “పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా, పొరుగు దేశాలపై ఆరోపణలు చేయడం తగదు. సరిహద్దు ఉగ్రవాదాన్ని కొనసాగించడం ప్రాంతీయ శాంతి భద్రతలకు ప్రమాదకరం” అని పేర్కొంది. ఇప్పటికే పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రదాడులు పెరుగుతుండగా, ఆ దేశం ఆఫ్ఘాన్ తాలిబాన్ మద్దతుదారులను బాధ్యత వహింపజేయాలనే ప్రయత్నంలో ఉందని సమాచారం. తాలిబన్ ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ దాడులను ఆఫ్ఘాన్ సార్వభౌమత్వానికి విరుద్ధమని ఖండించింది.
అఫ్గాన్‌కు భారత్ ఎందుకు మద్దతు ఇస్తోంది?
భారత్ అఫ్గానిస్థాన్‌కు మద్దతు ఇవ్వడం వెనుక ప్రధాన కారణం ప్రాంతీయ శాంతి, భద్రతను కాపాడటం. అఫ్గానిస్థాన్ స్థిరంగా ఉంటే ఉగ్రవాదం, అక్రమ రవాణా తగ్గుతాయి. పాకిస్థాన్ ప్రభావాన్ని తగ్గించి, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించేందుకు భారత్ అఫ్గాన్‌తో స్నేహ సంబంధాలను పెంచుకుంటోంది. చాబహార్ పోర్ట్ ద్వారా వాణిజ్యం సులభతరం అవుతుంది. అదనంగా భారత్ అఫ్గాన్‌లో రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు, పార్లమెంట్ భవనం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం అందించింది. చారిత్రక, సాంస్కృతిక బంధాలు కూడా ఈ మద్దతును బలపరుస్తున్నాయి.
