
అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం.. 4.2గా తీవ్రత నమోదు
అఫ్గానిస్తాన్‌లో మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు భారత జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్) నివేదించింది. గత కొన్ని రోజులుగా అఫ్గానిస్తాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకంపనలు ప్రజల్లో ఆందోళన పెంచాయి.
ఎన్‌సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2:20 గంటలకు సంభవించింది. దీని భూకంప కేంద్రం (ఎపిసెంటర్) 36.43° ఉత్తర అక్షాంశం, 71.20° తూర్పు రేఖాంశం వద్ద, భూమికి 140 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రత తక్కువగా, లోతు ఎక్కువగా ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎక్కడా నివేదికలు అందలేదు.
అఫ్గానిస్తాన్ భౌగోళికంగా హిందూ కుష్ పర్వత శ్రేణి ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భారత్-యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఘర్షణ పడే జోన్‌లో ఉండటం వల్ల ఇది తరచూ భూకంపాలు సంభవించే క్రియాశీలక ప్రాంతంగా ఉంది. ఈ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనడం/ రాపిడి వల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.
గత కొన్ని రోజులుగా అఫ్గానిస్తాన్‌లో వరుసగా భూకంపాలు సంభవించడం అక్కడి ప్రజలను కలవరపెడుతోంది. ముఖ్యంగా నవంబర్ 4న ఉత్తర అఫ్గానిస్తాన్‌ను 6.3 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం వణికించింది. మజార్-ఎ-షరీఫ్ సమీపంలో సంభవించిన ఈ పెను విపత్తులో కనీసం 27 మంది మరణించగా, 956 మందికి పైగా గాయపడినట్లు తాలిబాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ 8న కూడా రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం ప్రకారం, అఫ్గానిస్తాన్ తరచుగా సంభవించే వరదలు, కొండచరియలు విరిగిపడటం, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలకు నిలయంగా ఉంది. ఇప్పటికే దశాబ్దాల పాటు కొనసాగిన సంఘర్షణ, అభివృద్ధి లేమి కారణంగా ఇబ్బందులు పడుతున్న బలహీన వర్గాల ప్రజలకు ఈ భూకంపాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
