
అఫ్గానిస్తాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులు
అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్ బెర్మల్ జిల్లాలో ఉన్న ఒక మత పాఠశాల (సెమినరీ)పై పాకిస్థాన్ వైమానిక దళం దాడి చేసినట్లు టోలో న్యూస్ నివేదించింది. అదేవిధంగా నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని ఖోగ్యాని జిల్లాలో కూడా పాకిస్థాన్ యుద్ధవిమానాలు పలు వైమానిక దాడులు నిర్వహించినట్లు కూడా పేర్కొంది. శనివారం నుంచి బెర్మల్, అర్గున్ (పక్తికా), అలాగే ఖోగ్యాని, బహ్సోడ్, ఘని ఖేల్ (నంగర్‌హార్) జిల్లాల్లో పాకిస్థాన్ అనేక దాడులు జరిపినట్లు సమాచారం. ఇస్లామాబాద్ మీడియా వర్గాలు కూడా ఈ దాడులను ధృవీకరించాయి. పాకిస్థాన్-అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అనుమానిత ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొన్నాయి. జియో న్యూస్ , పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ, ఫిత్నా అల్ ఖ్వారిజ్ (ఎఫ్ఏకే ), దాని అనుబంధ సంస్థలు, అలాగే దాయిష్ ఖొరసాన్ ప్రొవిన్స్ (డీకేపీ) కు చెందిన ఏడు శిబిరాలు, దాచుకున్న కేంద్రాలను ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. ఇస్లామాబాద్, బజౌర్, బన్నూలో రంజాన్ సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య చేపట్టినట్లు పేర్కొంది.
ఈ ఆత్మాహుతి దాడులు అఫ్గానిస్తాన్‌లో ఉన్న నాయకత్వం, హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు జరిగాయని, బాధ్యతను తెహ్రిక్-ఈ-తాలిబాన్ పాకిస్థాన్(టిటిపి), డీఐష్ అనుబంధ గుంపులు స్వీకరించాయని జియో న్యూస్ వెల్లడించింది. అఫ్గాన్ భూభాగాన్ని పాకిస్థాన్‌పై దాడులకు ఉపయోగించవద్దని తాము పునరావృతంగా కోరుతున్నామని ఇస్లామాబాద్ పేర్కొంటోంది. అదే సమయంలో, ప్రాంతీయంగా ఉగ్రవాద గుంపులకు ఆశ్రయం కల్పించిందనే ఆరోపణలపై పాకిస్థాన్ అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ ఆండ్రాబీ, డాన్ పత్రికకు ఇచ్చిన వివరాల ప్రకారం పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించకూడదని మేము చట్టబద్ధంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేరకపోతే, సహనంతో వ్యవహరిస్తూనే అన్ని ఎంపికలు పరిగణనలో ఉంటాయని పేర్కొన్నారు. అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వం దోహా ఒప్పందం కింద తీసుకున్న బాధ్యతలను నెరవేర్చాలని, అంతర్జాతీయ సమాజం కూడా అఫ్గాన్ అధికారులను ఆ దిశగా ఒత్తిడి తేవాలని పాకిస్థాన్ కోరింది.
అంతర్జాతీయ దర్యాప్తు కోరిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ
అఫ్గానిస్తాన్‌లోని బహ్సూద్ జిల్లాలో పాకిస్థాన్ వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన కనీసం 16 మంది పౌరులు మరణించినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఐహెచ్‌ఆర్‌ఎఫ్ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో, పాకిస్థాన్ సైన్యం ఒక పౌరుల నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపిందని ఒక కుటుంబ వంశాన్ని పూర్తిగా నిర్మూలించిన ఘటనగా అభివర్ణించింది. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం మృతుల్లో ఒక సంవత్సరపు శిశువు నుంచి 80 ఏళ్ల వృద్ధుడి వరకు పురుషులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ దాడిలో 80 ఏళ్ల షహాబుద్దీన్, 30 ఏళ్ల షరకత్, 40 ఏళ్ల మహ్మందా తదితరులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, 20 ఏళ్ల రియాజుల్లా గాయపడ్డాడని ఐహెచ్‌ఆర్‌ఎఫ్ తెలిపింది. వారు కేవలం సంఖ్యలు కాదు, మనుషులని సంస్థ పేర్కొంది. అయితే ఐహెచ్‌ఆర్‌ఎఫ్ ఈ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాల ఘోర ఉల్లంఘనగా పేర్కొంటూ, తక్షణం స్వతంత్ర, పారదర్శక అంతర్జాతీయ దర్యాప్తు చేపట్టాలని, దాడికి ఆదేశాలు ఇచ్చినవారిని, అమలు చేసినవారిని బాధ్యుల్ని చేయాలని డిమాండ్ చేసింది.
