
అఫ్గానిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి
అఫ్గానిస్తాన్‌లో ప్రకృతి విలయం సృష్టించింది. గత కొంతకాలంగా ఉన్న కరువు పరిస్థితులను మారుస్తూ కురిసిన ఈ సీజన్ తొలి భారీ వర్షాలు, మంచు తుపానులు చివరకు విషాదాన్ని మిగిల్చాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల ఇప్పటివరకు కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు గురువారం వెల్లడించారు.
కూలిన ఇంటి పైకప్పు.. ఐదుగురి మృతి
హెరాత్ ప్రావిన్స్‌లోని కాబ్కాన్ జిల్లాలో అత్యంత హృదయ విదారక ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం బాధాకరం. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుందని హెరాత్ గవర్నర్ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
గత సోమవారం నుంచి పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తాయని, ఎక్కువ ప్రాణనష్టం కూడా ఆ సమయంలోనే జరిగిందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి మహ్మద్ యూసఫ్ హమ్మద్ తెలిపారు. ఈ వాతావరణం వల్ల దేశంలోని మధ్య, ఉత్తర, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో ప్రజల సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆయన వివరించారు.
భారీ ఆస్తి నష్టం
ఈ వరదల వల్ల రహదారులు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వేలాది పశువులు మృతి చెందాయి. సుమారు 1,800 కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటికే పేదరికం, అస్థిర పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ఈ విపత్తు మరింత కష్టాలను తెచ్చిపెట్టింది. ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలకు అంచనా బృందాలను పంపించింది. నష్టం ఎంత జరిగిందో, ప్రజలకు ఇంకా ఏ సహాయం అవసరమో తెలుసుకునేందుకు సర్వేలు కొనసాగుతున్నాయి.
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్‌లా తీవ్రమైన వాతావరణ మార్పులకు ఎక్కువగా గురయ్యే దేశం. ముఖ్యంగా సీజనల్ వర్షాల తర్వాత అకస్మాత్తుగా వచ్చే వరదలు ఇక్కడ సాధారణమవుతున్నాయి. దశాబ్దాలుగా కొనసాగిన యుద్ధాలు, బలహీనమైన మౌలిక సదుపాయాలు, అడవుల నాశనం, వాతావరణ మార్పుల ప్రభావం కలిసి ఈ విపత్తుల తీవ్రతను పెంచుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మట్టి ఇళ్లే ఉండటంతో, ఇలాంటి వరదల ముందు అవి నిలవలేకపోతున్నాయి.
సహాయం కోసం ఐక్యరాజ్యసమితి పిలుపు
అఫ్గానిస్తాన్‌లోని పరిస్థితులు చూస్తుంటే, 2026లో కూడా ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత దారుణమైన కష్టాలను ఎదుర్కోక తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. అక్కడ దాదాపు కోటి 80 లక్షల మందికి తక్షణ సాయం అవసరమని, వారిని ఆదుకోవడానికి సుమారు 14 వేల కోట్ల రూపాయల (1.7 బిలియన్ డాలర్లు) నిధులు కావాలని ప్రపంచ దేశాలను కోరింది.
