Let's talk: editor@tmv.in
అప్పు చెల్లించలేదని దారుణం

అప్పు చెల్లించలేదని దారుణం

Panthagani Anusha
10 అక్టోబర్, 2025

దేశ రాజధానిలో చట్టాన్ని లెక్కచేయని నేరగాళ్లు ఎంత చిన్నపాటి కారణానికైనా భయంకరమైన హింసకు పాల్పడుతున్నారనడానికి నిదర్శనంగా రోహిణి ప్రాంతంలో జరిగినా సంఘటనే ఉదాహారణగా నిలుస్తోంది. కేవలం రూ.5,000 అప్పు తిరిగి ఇవ్వలేదన్న కారణంతో 22 ఏళ్ల యువకుడు తన స్నేహితుడిపై కత్తితో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 5వ తేదీన ఇందిరా జేజే క్యాంప్‌కు చెందిన రవి (22) మెడపై తీవ్ర కత్తిపోట్లతో బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందింది. బాధితుడి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, సౌత్ రోహిణి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109(1) (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.

పోలీసు బృందాలు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ స్థానిక వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతని పేరు రితిక్, అలియాస్ సావన్. అరెస్ట్ తర్వాత జరిపిన విచారణలో, రూ.5,000 రుణాన్ని రవి చెల్లించకపోవడం వల్లే ఈ దాడికి పాల్పడినట్లు సావన్ అంగీకరించాడు. దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసులు అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.

మరింత విస్తుపోయే విషయం ఏమిటంటే, అరెస్టయిన రితిక్ అలియాస్ సావన్ పోలీసుల రికార్డుల్లో పాత నేరస్థుడుగా ఉన్నాడు. గతంలోనే ఇతనిపై ఆరు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. అప్పుల తిరిగి ఇవ్వలేదన్న నెపంతో దాడి చేయడం, పాత నేర చరిత్ర కలిగి ఉండటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా చిన్నపాటి ఆర్థిక వివాదాల వెనుక పెద్ద నేర నెట్‌వర్క్‌ల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది.

పోలీసు వర్గాలు ప్రజలను హెచ్చరిస్తూ చిన్న మొత్తాల ఆర్థిక వివాదాలను హింసాత్మక మార్గంలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి. ఈ సంఘటన నగరంలో వ్యక్తిగత కలహాలు ఎలా ప్రాణహానికీ దారితీస్తున్నాయో మరోసారి రుజువు చేశాయి.

అప్పు చెల్లించలేదని దారుణం - Tholi Paluku