Let's talk: editor@tmv.in
అప్పుల పాలన తప్ప హామీల అమలేదీ: వైసీపీ

అప్పుల పాలన తప్ప హామీల అమలేదీ: వైసీపీ

Panthagani Anusha
8 మార్చి, 2026

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీల అమలు ఎక్కడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, వరూది కల్యాణి నిలదీశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోందని విమర్శించారు. సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకుండా కేవలం గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 నెలల కాలంలోనే ప్రభుత్వం రూ. 3.28 లక్షల కోట్ల భారీ రుణాలను తీసుకుందని ఇది గత ఐదేళ్లలో జరిగిన అప్పులతో సమానమని వారు పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి కేవలం అప్పులు పెంచుకుంటూ పోతున్నారని దీనివల్ల రాష్ట్రంపై వడ్డీల భారం పడుతోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 6.28 లక్షల ఉద్యోగాల గురించి గానీ, నిరుద్యోగ భృతి గురించి గానీ బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు.

ఇక రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఎమ్మెల్సీ వరూది కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. మోంథా తుఫాన్‌కు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.410 కోట్లు, మొత్తం బకాయిలు రూ.1,100 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అరటి పండ్ల ధర టన్నుకు రూ.30 వేల నుంచి రూ.5 వేల వరకు పడిపోయిందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు రూ.27,465 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపించారు. కౌలు రైతులను బడ్జెట్‌లో పట్టించుకోలేదని విమర్శించారు.

మరోవైపు ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఎమ్మెల్సీలు ఆరోపించారు. విశాఖపట్నంలో సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన 55 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ఎంపీకి చెందిన గీతం విద్యాసంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అదేవిదంగా అంగన్‌వాడీ కార్యకర్తలు తమ సమస్యల కోసం నిరసన తెలుపుతుంటే, వారిని అణచివేస్తూ గుడారాలను తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఇక ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.