
అప్పుల కుప్పగా తెలంగాణ: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ప్రజలను వంచించేలా, అంకెల గారడీగా ఉందని బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు.
ఈ బడ్జెట్ రైతులు, మహిళలు, నిరుద్యోగులను వంచించే విధంగా రూపకల్పన చేయబడిందని. రేవంత్ సర్కార్ గంటకు రూ. 19.8 కోట్లు, రోజుకు రూ. 416 కోట్ల చొప్పున అప్పులు చేస్తోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రెండేళ్లలో రూ. 3.47 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. ఆదాయం చారాణా ఉంటే, ఖర్చు ఆఠాణా అన్నట్లుగా బడ్జెట్ ఉంది. ఇది పూర్తిగా అప్పులపై ఆధారపడిన ప్రభుత్వం అని ఆయన ఎద్దేవా చేశారు.
బీసీలకు మొండిచెయ్యి - గ్యారంటీలు గాలికొదిలేశారు
జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపారని, ముస్లింల కంటే తక్కువ నిధులు ఇవ్వడం దారుణమని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించలేదని మండిపడ్డారు.ఎన్నికల హామీలైన నిరుద్యోగ భృతి, మహాలక్ష్మి పథకంపై స్పష్టత లేదని, ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. విద్యాశాఖకు 15శాతం నిధులు ఇస్తామని చెప్పి కేవలం 8శాతం మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అప్పర్ హౌస్, లోయర్ హౌస్‌లతో పాటు కాంగ్రెస్ 'కరప్షన్ హౌస్' నడుపుతోందని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.పేదల ఇళ్లను కూల్చి ఆ భూములను ఎవరికి కట్టబెట్టాలని చూస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన సొంత ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 21,126 బడులు శిథిలావస్థకు చేరాయని, వేలాది స్కూళ్లలో కనీసం టాయిలెట్లు లేక విద్యార్థినులు అవమాన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రుల సమయమంతా ఢిల్లీ పర్యటనలకే సరిపోతోందని, పాలనపై శ్రద్ధ లేదని విమర్శించారు. అబ్దుల్ కలాం మాటలు చెబుతున్న కాంగ్రెస్ ఇంకా స్లీపింగ్ మోడ్ లోనే ఉంది. ఉద్యోగ క్యాలెండర్ ఊసే లేదు. గత బీఆర్ఎస్ పాలనలో లాగే ఇప్పుడు కూడా విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చారు అని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్ రైతులు, మహిళలు, నిరుద్యోగులను మరోసారి మోసం చేసేలా ఉందని ఆయన తేల్చి చెప్పారు.
