
అప్పన్న స్వామి సన్నిధిలో భారత క్రికెటర్లు
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2–1తో కైవసం చేసుకున్న టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆదివారం కుటుంబంతో కలిసి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, టీమ్ ప్రతినిధులు ఆలయాన్ని సందర్శించారు.
డిసెంబర్ 6న విశాఖ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ – విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తుదిమ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 65 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. మొత్తం మూడు మ్యాచ్‌లలో 302 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా 135, 102, 65 పరుగులతో మంచి ఫారంలో ఉన్నారు.
కప్ప స్తంభం సేవ, గర్భగుడిలో ప్రత్యేక పూజలు
దేవస్థానం అధికారులు కోహ్లీ కుటుంబాన్ని స్వాగతించి కప్ప స్తంభం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయంగా జరిపే కప్ప స్తంభం ఆలింగనం సేవలో కోహ్లీ అనంతరం గర్భగుడిలో స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు నాదస్వర ధ్వనులతో వేదాశీర్వచనం అందించగా, పురోహితులు శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం సమయానికి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కోహ్లీని ఒక్కసారి చూడాలనే ఉత్సాహంతో భక్తులు మంది పోటీ పడ్డారు.
విరాట్ కోహ్లీ ఇటీవల ఆధ్యాత్మికత వైపు మరింతగా ఆకర్షితుడవుతున్నట్లు ఆయన పర్యటనలు స్పష్టం చేస్తున్నాయి. సింహాచల దర్శనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో కీలక అడుగుగా నిలిచింది. గత కొన్నేళ్లుగా ఆయన భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని పలుమార్లు సందర్శించి మహారాజ్ ఆశీస్సులు పొందుతున్నారు. 2022లో నైనిటాల్‌లోని కైచీ ధామ్‌ను సందర్శించడం ఆయన జీవితంలో ఒక ప్రత్యేక మలుపు తీసుకువచ్చిందని, ఆ దర్శనం అనంతరం కోహ్లీ ధ్యానం, భక్తి పట్ల మరింత ఆసక్తి పెంచుకున్నారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని సందర్శించడం ఆయనలో ఉన్న ఆధ్యాత్మికతను స్పష్టంగా చూపించింది. క్రికెట్ మైదానంలో దూకుడుగా రాణిస్తున్న కోహ్లీ, అంతర్గతంగా శాంతి, నిశ్చలత కోసం సమానమైన అన్వేషణ చేస్తూ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన చర్యలు సూచిస్తున్నాయి.
