Let's talk: editor@tmv.in
అప్పటి నోయిడా సీఈవోలను కూడా దర్యాప్తు చేయాలి:సుప్రీంకోర్టు

అప్పటి నోయిడా సీఈవోలను కూడా దర్యాప్తు చేయాలి:సుప్రీంకోర్టు

Pinjari Chand
11 డిసెంబర్, 2025

రైతులకు చట్టంలో ఉన్న హక్కు కంటే భూమి పరిహారాన్ని అధికంగా చెల్లించడంలో నోయిడా అధికారుల మధ్య ‘కుమ్మక్కు’ ‘ఒడంబడిక’ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), గత 10-15 సంవత్సరాలుగా నోయిడా అథారిటీకి సీఈవోలుగా, ఇతర ఉన్నతాధికారులుగా పనిచేసిన వారిని కూడా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం సిట్ కి దర్యాప్తు పూర్తి చేయడానికి మరో రెండు నెలల సమయాన్ని ఇచ్చింది. నోయిడా తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయంలో అథారిటీ దృక్కోణాన్ని వివరించే అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టును కోరారు. అధిక పరిహారం పొందిన రైతులపై ఎటువంటి శిక్షా చర్యలు తీసుకోమని, వారిని శిక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రైతులను నోటీసులతో వేధిస్తున్నారు

అధిక పరిహారం పొందిన ఒక రైతు తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దేవ్ తన కక్షిదారుకు సిట్ ముందు హాజరు కావాలని, స్టేట్మెంట్ ఇవ్వాలని నోటీసులు వస్తున్నాయని, రైతులను రక్షించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ‘ఇది రైతుల తప్పు కాదు’ అని ఆయన వాదించారు. దానికి ధర్మాసనం రైతులను వేధించడానికి ఈ దర్యాప్తు చేయడం లేదు. అధిక పరిహారం చెల్లించడంలో కుమ్మక్కైన అధికారులను గుర్తించడమే లక్ష్యమని గత ఆదేశాల్లోనే స్పష్టం చేశామని గుర్తు చేసింది. సిట్ సమర్పించిన స్టేటస్ రిపోర్టును కోర్టు రికార్డు మీదకు తీసుకుంది. ఆ రిపోర్టులో దర్యాప్తు పూర్తి చేయడానికి మరో మూడు నెలల సమయం కావాలని సిట్ కోరింది. నోయిడా అధికారులు బిల్డర్లతో కుమ్మక్కై రైతులకు హక్కుకు మించిన పరిహారం చెల్లించారన్న ఆరోపణలపై గత ఆగస్టు 13న సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.

ముందు సిట్ నివేదికలో ఆరోపణల్లో ప్రాథమిక సత్యం ఉన్నట్టు కనిపించడంతో, నోయిడాను ‘మెట్రోపాలిటన్ కౌన్సిల్’గా మార్చే అంశాన్ని ఉత్తరప్రదేశ్ మంత్రి మండలి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తప్పుడు అధికారుల బ్యాంకు ఖాతాలు, ఆస్తులను ఫోరెన్సిక్ ఆడిటర్లు, ఆర్థిక నేరాల విభాగం నిపుణుల సాయంతో పరిశీలించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్.బి. శిరద్కర్ నేతృత్వంలో మరో సిట్ ని కోర్టు ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సరిగా దర్యాప్తు చేయలేదని సంతృప్తి చెందని సుప్రీంకోర్టు, సొంతంగా సిట్ ని ఏర్పాటు చేసింది.

ఈ ఏడాది జనవరి 23న కోర్టు నాలుగు కీలక అంశాలను దర్యాప్తు చేయాలని ఆదేశించింది

• రైతులకు చెల్లించిన పరిహారం మొత్తం కోర్టు తీర్పుల ప్రకారం, వారికి రావాల్సిన దానికంటే ఎక్కువగా ఉందా?

• అలా అయితే దానికి బాధ్యులైన అధికారులు ఎవరు?

• లబ్ధిదారులు, నోయిడా అధికారుల మధ్య ఏమైనా కుమ్మక్కు జరిగిందా?

• నోయిడా పనితీరులో పారదర్శకత, న్యాయం, ప్రజా హితం లోపించాయా?

దర్యాప్తులో పారదర్శకత కోసం చీఫ్ విజిలెన్స్ అధికారిని (ఐపీఎస్, సీఏజీ నుంచి డెప్యుటేషన్పై) నియమించాలని, సిటిజన్ అడ్వైజరీ బోర్డును తక్షణం ఏర్పాటాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే నోయిడాలో ఎటువంటి ప్రాజెక్టును పర్యావరణ ప్రభావ అంచనా, సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ ఆమోదం లేకుండా అమలు చేయరాదని ఆదేశించింది. అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు త్వరగా తీసుకునేలా, అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు అవసరమైన సాంక్షన్‌ను రెండు వారాల్లో మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయం మొదట నోయిడా న్యాయ సలహాదారులు, లా అధికారుల అరెస్టు ముందస్తు బెయిల్ పిటిషన్ల సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. వారిపై హక్కు లేని రైతులకు కోట్ల రూపాయల పరిహారం విడుదల చేసిన ఆరోపణలు ఉన్నాయి.

కేసు పూర్వ పరాలు

1976లో నోయిడా అథారిటీ ఏర్పడినప్పుడు ఎలాంటి అక్రమాలు జరగలేవు. అప్పుడు ఇచ్చిన పరిహారాలు చాలా తక్కువ. ఈ కుంభకోణం 2010 తర్వాత, ప్రభుత్వ డబ్బు (వందల కోట్లు) దుర్వినియోగం చేసి, అధికారులు-బిల్డర్లు-రైతుల మధ్య కుమ్మక్కుతో జరిగింది. సుప్రీంకోర్టు ఇప్పుడు పూర్తి దర్యాప్తునకు ఆదేశించింది.