Let's talk: editor@tmv.in
అపార నష్టం కలిగింది ఆదుకోండి: ఏపీ ప్రభుత్వం

అపార నష్టం కలిగింది ఆదుకోండి: ఏపీ ప్రభుత్వం

Panthagani Anusha
11 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విరుచుకుపడ్డ మొంథా తుపాను అంచనాలకు మించి ఎక్కువ నష్టం మిగిల్చిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి వివరించింది. తుపాను ప్రభావంతో రూ. 6,384 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని, అత్యవసర సహాయక చర్యల కోసం కనీసం రూ. 901.4 కోట్లు వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

తుఫాను కారణంగా జరిగిన నష్టం అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ పాసుమీ బసు, కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్‌ కె. పొన్నుస్వామి నేతృత్వంలోని 8 మంది బృందం సోమవారం అమరావతిలోని సచివాలయానికి చేరుకుంది. ఆర్టీజీఎస్‌ వద్ద అధికారుల స్వాగతం అనంతరం, రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి, ఆర్టీజీఎస్‌ సీఎస్‌ఓ ప్రఖర్ జైన్ తుపాను ప్రభావంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

జయలక్ష్మి వివరించిన ప్రకారం, మొంథా తుపాను 24 జిల్లాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది, కోత దశకు వచ్చిన పంటలు నీట మునిగి పోవడంతో రైతులు నష్టపోయారని తెలిపారు. మొత్తం 1.61 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. అదేవిధంగా 6,250 హెక్టార్ల ఉద్యానవన పంటలు, 17.72 హెక్టార్ల మల్బరీ తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు.

మత్స్యకారులు తీవ్ర నష్టం చవిచూశారని 3,063 హెక్టార్ల చేపల చెరువులు నాశనం అయ్యాయని వివరించారు. గృహ నిర్మాణ రంగంలో 4,566 ఇళ్లు, విద్యా రంగంలో 1,853 పాఠశాలలు దెబ్బతిన్నాయి. రోడ్ల విభాగానికి చెందిన 4,794 కిలోమీటర్ల రోడ్లు, 311 వంతెనలు/కల్వర్టులు ధ్వంసమయ్యాయి. నీటిపారుదల శాఖకు చెందిన 3,437 మైనర్, 2,417 మెజర్ & మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నష్టం జరిగింది. పట్టణ ప్రాంతాలలో 58 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ ప్రభావితమయ్యాయి అని తుపాను కారణంగా స‌ర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులు మ‌ళ్లీ కోలుకోవ‌డానికి కేంద్రం అందించే స‌హాయం, స‌హ‌కారం ఎంతో కీల‌క‌మ‌ని అన్నారు.

680 డ్రోన్లు ఉప‌యోగించాం

రాష్ట్ర ప్ర‌భుత్వం తుపాను ఎదుర్కోవ‌డానికి ఎంతో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా నివారించ‌గ‌లిగామ‌ని అధికారులు వివ‌రించారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కూడా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టామ‌ని తెలిపారు. బుడ‌మేరు వ‌ర‌ద‌ల అనుభ‌వంతో ఈ సారి వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం 680 డ్రోన్లు ఉప‌యోగించామ‌ని చెప్పారు. అక్టోబ‌రు 27-29 వ తేదీల మ‌ధ్య 82.3 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని ఇది సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే 9 రెట్టు ఎక్కువ‌న్నారు. 443 మండ‌లాల్లో ఈ తుపాన్ ప్ర‌భావం చూపించింద‌ని, ఈ విప‌త్తు కార‌ణంగా 3 మృతి చెందార‌ని, 9,960 ఇళ్లు నీట మునిగాయ‌ని, 1,11,402 మంది నిరాశ్ర‌యుల‌య్యార‌ని తెలిపారు. తుపాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 12 ఎన్డీఆర్ ఎఫ్‌, 13 ఎస్డీఆర్ ఎఫ్ బృందాల‌ను, 1,702 వాహ‌నాల‌ను, 110 మంది ఈత‌గాళ్ల‌ను వినియోగించామ‌ని వెల్ల‌డించారు. 22 జిల్లాల్లో 2,471 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసి1,92,441 మందికి పున‌రావాసం క‌ల్పించామ‌న్నారు.

అపార నష్టం కలిగింది ఆదుకోండి: ఏపీ ప్రభుత్వం - Tholi Paluku