Let's talk: editor@tmv.in
అపస్మారక స్థితిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ?

అపస్మారక స్థితిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ?

Shaik Mohammad Shaffee
8 ఏప్రిల్, 2026

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అగ్రనాయకత్వంలో భారీ కుదుపు చోటుచేసుకుంది. ఆ దేశ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో అపస్మారక స్థితిలో ఉన్నట్లు అంతర్జాతీయ నిఘా వర్గాలు వెల్లడించాయి. అమెరికా, ఇజ్రాయెల్ నిఘా విభాగాల సమాచారం ప్రకారం.. ఆయన ప్రస్తుతం క్వామ్ నగరంలో అత్యవసర చికిత్స పొందుతున్నారని 'ది టైమ్స్ యూకే' పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.

నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో మోజ్తబా?

గత కొన్నిరోజులుగా ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు రాకపోవడంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఆయన ప్రస్తుతం స్పృహలో లేరని, దేశానికి సంబంధించిన ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఆయన లేరని విదేశీ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మోజ్తబా పరిస్థితి ఇలా ఉండగా, మరోవైపు ఆయన తండ్రి (మాజీ సుప్రీం లీడర్) అంత్యక్రియల కోసం క్వామ్ నగరంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు అయోమయంలో పడినట్లు కనిపిస్తోంది.

ముగిసిన గడువు.. ట్రంప్ తీవ్ర హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువు భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటలకు ముగిసింది. వెంటనే శాంతి ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. "నేను ఇచ్చిన 10 రోజుల సమయం అయిపోయింది.. ఒకవేళ డీల్ కుదరకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తాం. ఆ దేశాన్ని తిరిగి రాతి యుగంలోకి నెట్టేస్తాం" అని ట్రంప్ అత్యంత కఠినంగా స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

'తల లేని మొండెంలా ఇరాన్'

ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ శక్తివంతంగానే ఉన్నా, ప్రస్తుత దాడులతో ఆ దేశ నాయకత్వాన్ని తాము 'ఛిన్నాభిన్నం' చేశామని ట్రంప్ వ్యాఖ్యానించారు. గత 47 ఏళ్లుగా ఏడు మంది అమెరికా అధ్యక్షులు చేయలేని పనిని తాను చేస్తున్నానని, ఇరాన్‌ను దారిలోకి తెచ్చేందుకు ఇది కీలక సమయమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వాషింగ్టన్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ద్వారా అమెరికా తన సందేశాలను ఇరాన్ ప్రతినిధులకు పంపుతోంది.