Let's talk: editor@tmv.in
అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర‌, ఆన్‌లైన్‌లోనే అందివ్వాలి: ఐటీ శాఖ‌ కార్య‌ద‌ర్శి

అన్ని సేవ‌లూ మ‌న‌మిత్ర‌, ఆన్‌లైన్‌లోనే అందివ్వాలి: ఐటీ శాఖ‌ కార్య‌ద‌ర్శి

Panthagani Anusha
13 జనవరి, 2026

రాష్ట్రంలో పాలనను పూర్తిగా డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్ర‌భుత్వంలోని ప్ర‌తి శాఖ ప్ర‌జ‌ల‌కు అందించే అన్ని సేవ‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్‌లోనూ, 'మ‌న‌మిత్ర' వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లోనే అందించాల‌ని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని స్పష్టం చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలందించడం సాధ్యమవుతుందని వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి ఆశయమని దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

అయితే సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని శాఖలు మాన్యువల్‌గా సేవలు అందిస్తున్నాయని భాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. ఇకపై మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి కేవలం ఆన్‌లైన్ మరియు 'మనమిత్ర' వేదికల ద్వారానే సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఈ మార్పుపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. డేటా అనుసంధానం ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని దీని ఆధారంగా ఆయా శాఖలకు ఉపయోగపడేలా ఏప్రిల్ నెలాఖరుకల్లా 98 ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారిత యూస్ కేసెస్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

ప్రభుత్వ శాఖలు తమ అవసరాలకు అనుగుణంగా ఎటువంటి సాంకేతిక సహాయం కావాలన్నా ఐటీ శాఖను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. శాఖల వారీగా విజ్ఞప్తులు అందితే ఇప్పుడు సిద్ధం చేస్తున్న 98 యూస్ కేసెస్‌తో పాటు అదనంగా మరిన్ని రూపొందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలోని 'అవేర్' విభాగం ద్వారా వాతావరణ సమాచారంతో పాటు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. అవేర్ విభాగం ద్వారా దాదాపు 50 రకాల పరిష్కార మార్గాలు సిద్ధమవుతున్నాయని అన్ని శాఖలు ఈ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.