
అన్ని శాఖల్లో ఏఐ వినియోగంతో సమర్ధ పాలన: సీఎం చంద్రబాబు
ప్రభుత్వ యంత్రాంగంలో సమూల మార్పులు తీసుకువస్తూ అత్యాధునిక సాంకేతికతను జోడించడం ద్వారా సమర్థవంతమైన పాలన అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్‌పై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని పెంచాలని దీనివల్ల నిర్ణయాధికారంలో వేగం, పారదర్శకత పెరుగుతాయని సీఎం సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాలు, శాటిలైట్ నుంచి అందుతున్న సమాచారాన్ని ఒకే చోట అనుసంధానించేలా పటిష్టమైన మెకానిజం రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా త్వరితగతిన స్పందించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని తద్వారా సేవల నాణ్యత మెరుగుపడుతుందని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో జరుగుతున్న పేలుళ్ల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం తమిళనాడులోని శివకాశికి వెళ్లి అక్కడ పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని సూచించారు.
రోవైపు వేసవి సమీపిస్తున్న తరుణంలో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బస్సు ఎక్కినప్పటి నుంచి గమ్యం చేరే వరకు ప్రయాణం సుఖమయంగా ఉండాలని మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని పేర్కొన్నారు. ఇక పెన్షన్ల పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని ముఖ్యంగా స్వర్ణ గ్రామాలు స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడా ఫిర్యాదులకు తావులేకుండా చూడాలన్నారు.
అనవసర సర్వేలతో ఇబ్బంది పెట్టొద్దు
ప్రభుత్వ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్థవంతంగా వాడుకోవాలని కేవలం అదనపు సమాచారం అవసరమైతేనే సర్వేలు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒకే రకమైన సమాచారం కోసం ప్రజలను సిబ్బందిని మాటిమాటికీ ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. ఇదే సమయంలో వాట్సాప్ 'మన మిత్ర' సేవలను 953కు పెంచినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ డిజిటల్ సేవలను ప్రజలు సులభంగా వినియోగించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు.
