Let's talk: editor@tmv.in
అన్ని జిల్లాల్లో లాజిస్టిక్స్ ఫెసిలిటేషన్ సెల్స్: ఎం.టి. కృష్ణబాబు

అన్ని జిల్లాల్లో లాజిస్టిక్స్ ఫెసిలిటేషన్ సెల్స్: ఎం.టి. కృష్ణబాబు

Panthagani Anusha
11 మార్చి, 2026

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనను మరింత వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలోగా పూర్తి చేసే లక్ష్యంతో అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి లాజిస్టిక్స్ ఫెసిలిటేషన్ సెల్స్ ఏర్పాటుకు సోమవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఈ నూతన విభాగం ప్రధానంగా విమానయాన లాజిస్టిక్స్ భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించనుంది. గతంలో భూసేకరణ అనుమతుల ప్రక్రియలో జరుగుతున్న జాప్యం వల్ల అనేక ప్రాజెక్టులు అవాంతరాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక యంత్రాంగం ఉండాలని ప్రభుత్వం భావించింది. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంపిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

అయితే ఈ సెల్స్ క్షేత్రస్థాయిలో భూసేకరణ ప్రక్రియను సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వ భూముల బదలాయింపు అక్రమ ఆక్రమణల తొలగింపు వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించనున్నాయి. అంతేకాకుండా ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి చెల్లించాల్సిన పరిహారం పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణ కూడా ఈ సెల్ పరిధిలోకి రానున్నాయి. దీనివల్ల ప్రాజెక్టులకు అవసరమైన భూమిని వేగంగా సిద్ధం చేసే అవకాశం కలుగుతుంది.

భూమి సిద్ధం చేయడమే కాకుండా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుబంధ మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఈ సెల్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాజెక్టు ప్రదేశాల వరకు నీటి సరఫరా ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి అంచనాలు రూపొందించడం సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందడం ఆ పనుల అమలును పర్యవేక్షించడం వంటివి ఈ సెల్ బాధ్యతలే. ఈ నూతన వ్యవస్థతో రాష్ట్రంలో పారిశ్రామిక రవాణా రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అన్ని జిల్లాల్లో లాజిస్టిక్స్ ఫెసిలిటేషన్ సెల్స్: ఎం.టి. కృష్ణబాబు - Tholi Paluku