Let's talk: editor@tmv.in
అన్ని ఆలయాల్లో ‘శ్రీవారి సేవకులు’ తరహా విధానం అమలు చేయాలి: సీఎం

అన్ని ఆలయాల్లో ‘శ్రీవారి సేవకులు’ తరహా విధానం అమలు చేయాలి: సీఎం

Panthagani Anusha
31 డిసెంబర్, 2025

రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు తిరుమల శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అన్నిచోట్లా ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ ద్వారా రెవెన్యూ, వ్యవసాయం, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం, దేవదాయ వంటి కీలక శాఖల పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భగవంతుని సేవలో భాగస్వాములయ్యేందుకు చాలామంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తారని, అటువంటి వారిని గుర్తించి స్థానిక వాలంటీర్లుగా నియమించుకోవాలని సూచించారు. ఇప్పటికే శ్రీశైలంలో ఈ విధానం కొనసాగుతోందని, అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా భక్తుల సేవల కోసం ప్రత్యేక జాబితాను సిద్ధం చేసి వారి సేవలను వినియోగించుకోవాలని దేవదాయ శాఖకు స్పష్టం చేశారు.

వైద్యారోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా, ఆసుపత్రుల పనితీరుపై సీఎం కీలక సూచనలు చేశారు. పీహెచ్‌సీలు మొదలుకొని జిల్లా ఆసుపత్రుల వరకు మెరుగైన సౌకర్యాలు ఉండాలని రోగుల పట్ల కనికరంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆసుపత్రి ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్లు కేవలం రెగ్యులర్ అంశాలకే పరిమితం కాకుండా, ప్రజలు నిత్యం సందర్శించే ప్రభుత్వ కార్యాలయాల క్షేత్రస్థాయి పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. రెవెన్యూ శాఖపై గతంలో ఉన్న చెడ్డపేరును పోగొట్టుకునేలా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని, భూ సర్వేల విషయంలో ఎటువంటి తప్పిదాలకు తావుండకూడదని హెచ్చరించారు.

వ్యవసాయ, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజారోగ్యం బాగుండాలంటే నాణ్యమైన ఆహార ఉత్పత్తులు పండాలని, ఇందుకోసం భూసార పరీక్షలు నిర్వహించి మట్టిలోని పోషక విలువలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ ఎరువుల వినియోగంతో మేలైన పంటలు పండించేలా రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతు సేవా కేంద్రాలు, పీహెచ్‌సీలు కలిసి పనిచేసేలా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు.

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని మిల్లర్లు ఎవరైనా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. అదేవిధంగా రవాణా శాఖలో ఆధునిక మార్పులు తీసుకురావాలని, రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొని ప్రగతి నివేదికలను సమర్పించారు.