Let's talk: editor@tmv.in
అన్నామలై ఓ‘జీరో’: ఆదిత్యఠాక్రే

అన్నామలై ఓ‘జీరో’: ఆదిత్యఠాక్రే

Pinjari Chand
13 జనవరి, 2026

ముంబైపై బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే సోమవారం తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్రను అవమానించే అన్నామలై వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు సహించరని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆదిత్య ఠాక్రే అన్నామలై బీజేపీ ముఖచిత్రం. కానీ ఆయన ఒక ‘జీరో’. అక్కడ గెలవలేకపోయారు, తన డిపాజిట్ కూడా కాపాడుకోలేకపోయారు. ఒకప్పుడు ఆయనే తదుపరి ప్రధాని అంటూ ప్రచారం చేశారు. కానీ తమిళనాడు ప్రజలు వారికి ‘జీరో’ అని చూపించారు. మరోవైపు సీఎం స్టాలిన్ తమిళనాడును వేగంగా ముందుకు తీసుకెళ్తుంటే, వీళ్లు మాత్రం గొడవలు, దూషణలకే పరిమితమవుతున్నారు. అన్నామలై మహారాష్ట్రను అవమానించారు. దీన్ని రాష్ట్రం సహించదు. అన్నామలైతో పాటు బీజేపీ కూడా మహారాష్ట్రను అవమానించిందని అన్నారు. ముంబై బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో, ధారావి ప్రాంతంలో నిర్వహించిన సభలో అన్నామలై, ముంబై మహారాష్ట్ర నగరం కాదు, అంతర్జాతీయ నగరమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగిన నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే స్పందించారు.

బీజేపీపై ఆదిత్య ఠాక్రే మరిన్ని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ముంబైపై కానీ, మహారాష్ట్రపై కానీ ఎలాంటి ప్రేమ లేదు అన్న విషయం ప్రజలకు బాగా తెలుసు. లడ్కీ బెహన్ పథకం లేదా హిందూ–ముస్లిం అంశాలతో ప్రజలను బిజీగా ఉంచుతూ, మొత్తం మహారాష్ట్రను పరిశ్రమదారులకు ఉచితంగా అప్పగిస్తున్నారు. ఇది పాలన కాదు, దుర్మార్గం అని విమర్శించారు. ఇదిలా ఉండగా, అన్నామలై మహారాష్ట్రలో ‘ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం’ అవసరమని వ్యాఖ్యానిస్తూ ముంబైకి బీజేపీ మేయర్, రాష్ట్రంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉండాలి. ముంబై బడ్జెట్ రూ.40 వేల కోట్లకు పైగా ఉంది. బెంగళూరు బడ్జెట్ రూ.19 వేల కోట్లు, చెన్నైది రూ.8 వేల కోట్లు మాత్రమే. ఇంత పెద్ద నగరాన్ని నిర్వహించేందుకు మంచి పాలకులు అవసరమని అన్నారు.

అన్నామలై కాదు.. రసమలై

ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే, అన్నామలైని వ్యంగ్యంగా ‘రసమలై’ అని పిలిచారు. తమిళనాడులో నుంచి ఓ రసమలై వచ్చాడు. ఇక్కడ నీకేం సంబంధం? లుంగీ తొలగించు – పుంగీ మోగించు అంటూ బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన నినాదాన్ని ప్రస్తావిస్తూ రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన అన్నామలై నన్ను బెదిరించే హక్కు ఆదిత్య ఠాక్రేకు, రాజ్ ఠాక్రేకు ఎవరు ఇచ్చారు? నేను రైతు బిడ్డను అనే విషయంపై గర్వపడుతున్నాను. నన్ను దూషించడానికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేను ఇంత ముఖ్యుడినయ్యానా? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు (పుణే మున్సిపల్ కార్పొరేషన్, బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్, పింప్రి–చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ సహా) ఎన్నికలు జరుగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జనవరి 15న పోలింగ్, జనవరి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.