
అన్నాదురై వారసత్వంతో మాకు సహజ బంధం ఉంది:విజయ్
కాంచీపురం నేలతో తమ పార్టీకి ఉన్న చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, డీఎంకే పాలనపై టీవీకే అధినేత, నటుడు విజయ్ ఘాటుగా ప్రశ్నలు సంధించారు. ఆదివారం జిల్లాలో జరిగిన క్లోజ్–డోర్ సమావేశంలో కేడర్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ అన్నాదురై, ఎంజీఆర్ వారసత్వాన్ని ప్రస్తావించి ప్రస్తుత డీఎంకేపై నిప్పులు చెరిగారు. అన్నాదురై గుర్తే తమిళ రాజకీయాల పునాది. ఆయనకు గౌరవంగా ఎంజీఆర్ కూడా తన పార్టీ జెండాపై అన్నా గుర్తు ఉంచుకున్నారు. అన్నాదురై సిద్ధాంతాలను డీఎంకే ఇప్పటికీ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. డీఎంకే ఇప్పుడు 'సిద్ధాంతం ధర ఎంత?' అని అడుగుతుంది. వారు మా సిద్ధాంతం గురించి ప్రశ్నిస్తున్నారు అని ఆయన విమర్శించారు. మా తొలి ప్రజా అవగాహన యాత్ర పరండూరు నుంచే మొదలైంది. కాబట్టి కాంచీపురంతో మాకు సహజ అనుబంధం ఉంది అన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును మొదటగా ఆశ్రయించిన పార్టీ టీవీకేనే, కులగణనను నిరంతరం కోరుతున్నాం. సీఏఏకు వ్యతిరేకంగా మొదట గళం విప్పింది టీవీకేనే అని గుర్తు చేశారు. టీవీకే పార్టీ సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విజయ్ పేర్కోన్నారు.
డీఎంకే… 75 ఏళ్ల బిడ్డలా
ప్రజలు నమ్మి ఓటు వేసిన వారినే డీఎంకే మోసం చేసింది. వారి అంతర్గత వ్యవహారాలు చూస్తే… 75 ఏళ్ల బిడ్డలా కనిపిస్తోంది. మేమింకా పూర్తి స్థాయి ప్రతిపక్ష యుద్ధం మొదలు పెట్టకముందే వీళ్లు అల్లాడుతున్నారు అన్నారు. డీఎంకే చర్యలన్నీ డ్రామా తప్ప మరేమీ కాదని విజయ్ అన్నారు. ప్రజలు అన్నా సిద్ధాంతాలు గుర్తు చేసుకుని, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తోందో ఆలోచించాలి. టీవీకే అందరికీ సమాన సేవ చేసేందుకే ఉంది అని స్పష్టం చేశారు.
కరూరు తొక్కిసలాట తర్వాత తొలి సమావేశం
రాబోయే ఎన్నికలకు ముందు కాంచీపురంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని టీవీకే ప్రయత్నిస్తోంది. సెప్టెంబరులో 41 మంది ప్రాణాలు కోల్పోయిన కరూరు తొక్కిసలాట ఘటన తర్వాత, విజయ్ పాల్గొన్న తొలి రాజకీయ సమావేశం ఇదే. కేడర్‌ను ఉత్తేజపరచడం, రాబోయే ఎన్నికల ముందు క్షేత్ర స్థాయి కార్యకలాపాలను బలపరచడమే లక్ష్యమని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంచీపురం జిల్లాలోని మూడు తాలూకాల నుంచి ఎంపిక చేసిన నాయకులతో ఈ భేటీ నిర్వహించారు.
