Let's talk: editor@tmv.in
అన్నవరం ప్రసాదం బుట్టల్లో ఎలుకల కలకలం

అన్నవరం ప్రసాదం బుట్టల్లో ఎలుకల కలకలం

Panthagani Anusha
25 జనవరి, 2026

కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న నమూనాలయం వద్ద ప్రసాద నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యం తీవ్ర కలకలం రేపింది. స్వామివారి ప్రసాదం నిల్వ ఉంచిన బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న పవిత్ర ప్రసాదం విషయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

జాతీయ రహదారి పక్కన ఉన్న అన్నవరం నమూనాలయం వద్ద రోజూ వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, ప్రయాణికులు ప్రసాదం కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య అక్కడికి వచ్చిన కొందరు భక్తులు ప్రసాద ప్యాకెట్లు నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బుట్టల్లో ఎలుకలు సంచరిస్తున్న దృశ్యాలను గమనించారు. వెంటనే వాటిని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వైరల్ వీడియోలో ప్రసాదం ఉన్న బుట్టలపై ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సిబ్బందిని ప్రశ్నించిన భక్తులపై కొందరు నిర్లక్ష్యంగా స్పందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ ఘటనపై భక్తుల నుంచి వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో విషయం ఆలయ ఈవో త్రినాథరావు దృష్టికి వెళ్లింది. అధికారులు తక్షణమే స్పందించి ప్రసాదం నిల్వ చేసే క్యాబిన్‌కు మరమ్మతులు చేయించారు. ఎలుకలు లోపలికి ప్రవేశించకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన సిబ్బంది త్రిమూర్తులు, భద్రతా సిబ్బంది రాజులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అన్నవరం ప్రసాదానికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. సత్యనారాయణ వ్రత ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రసాదాన్ని ఒక చిటికెడు దొరికినా భక్తిశ్రద్ధలతో కళ్లకు అద్దుకుని స్వీకరించే భక్తులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటి పవిత్ర ప్రసాదం తయారీ, నిల్వ, పంపిణీ విషయంలో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద నిర్వహణలో ఇకపై ఎలాంటి లోపాలు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేస్తామని వారు స్పష్టం చేశారు. అయితే ఆలయాల పవిత్రతను కాపాడే బాధ్యత అధికారులదేనని ప్రసాదం వంటి అత్యంత సున్నితమైన అంశంలో నిర్లక్ష్యం సహించబోమని భక్తులు స్పష్టం చేస్తున్నారు.

అన్నవరం ప్రసాదం బుట్టల్లో ఎలుకల కలకలం - Tholi Paluku