Let's talk: editor@tmv.in
అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. అధికారుల హై అలర్ట్

అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. అధికారుల హై అలర్ట్

Panthagani Anusha
10 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పక్షుల ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా) కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా సోడమ్ , కర్వేటినగరం మండలాల్లో దేశీ కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందుతుండటంతో పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. అన్నమయ్య జిల్లాలో వైరస్ ఉనికి నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభావిత ప్రాంతాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను (ఆర్ఆర్ టీ) మోహరించినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

అన్నమయ్య జిల్లా సోడం మండలంలోని అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో కోళ్ల మరణాలు సంభవించడంతో అధికారులు నమూనాలను సేకరించి భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ కు పంపారు. ఫిబ్రవరి 8న అందిన నివేదికల ప్రకారం బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో, జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. శని, ఆదివారాల్లో సుమారు 90 కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. ఈ క్రమంలో వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణాను పూర్తిగా నిలిపివేశారు.

వైరస్ నియంత్రణకు సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానాలను అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పశుసంవర్ధక, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖల సమన్వయంతో కోళ్లను నశింపజేసే (కలింగ్) ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే రెండు ఫారాల్లో కలింగ్ పూర్తయిందని, పరిస్థితిని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.

ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా పక్షుల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని ఇది మానవులకు సంక్రమించదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న పుకార్లు ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. కోళ్లలో ఆకస్మికంగా లేదా కారణం తెలియని మరణాలు సంభవించినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ (70131 19447) లేదా జిల్లా కంట్రోల్ రూమ్‌ (08572-242730) ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.