Let's talk: editor@tmv.in
అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం: మోటార్‌సైకిల్ పొగ పీల్చి నలుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం: మోటార్‌సైకిల్ పొగ పీల్చి నలుగురు మృతి

Panthagani Anusha
17 మార్చి, 2026

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భీకర విషాదం చోటుచేసుకుంది. అజాగ్రత్త, అవగాహన లోపం ఒక కుటుంబానికి చెందిన నలుగురిని బలితీసుకున్నాయి. మోటార్‌సైకిల్ ఇంజిన్ నుంచి వెలువడిన విషపూరిత వాయువులను పీల్చుకోవడంతో తాతతో పాటు ముగ్గురు చిన్నారులు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మురళి అనే వ్యక్తి తన మోటార్‌సైకిల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు శనివారం ఒక మెకానిక్‌ను సంప్రదించాడు. అయితే వాహనం సక్రమంగా పనిచేయాలంటే ఇంజిన్‌ను రాత్రంతా ఆన్ చేసి ఉంచాలని సదరు మెకానిక్ సూచించినట్లు తెలుస్తోంది. మెకానిక్ సూచనల మేరకు న మురళి శనివారం రాత్రి తన బైక్‌ను ఇంటి లోపల గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంచి ఇంజిన్‌ను స్టార్ట్ చేసి అలాగే వదిలేశాడు. అనంతరం అతను అతని భార్య కలిసి మొదటి అంతస్తులోని గదిలోకి వెళ్లి నిద్రపోయారు.

అదే సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గదిలో మురళి తండ్రి ముగ్గురు చిన్నారులు నిద్రపోయారు కాగా రాత్రంతా ఇంజిన్ నడుస్తూ ఉండటంతో, సైలెన్సర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రాణాంతక వాయువులు గది నిండా వ్యాపించింది. కిటికీలు, తలుపులు మూసి ఉండటంతో ఆ పొగ బయటకు వెళ్లే మార్గం లేక గదిలోనే పేరుకుపోయింది. గాఢ నిద్రలో ఉన్న నలుగురు ఆ విషవాయువులను పీల్చుకోవడంతో అపస్మారక స్థితికి చేరుకుని చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

కాగా మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయంలో నిద్రలేచిన మురళి కింద ఉన్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వ్యక్తం చేశాడు. లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన చెందిన అతను స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే గదిలో దట్టమైన పొగ అలుముకుని ఉండగా తన తండ్రి మరియు పిల్లలు అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి హతాశుడయ్యాడు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మూసి ఉన్న గదిలో పెట్రోల్ ఇంజిన్ నడపడం వల్ల ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ మోనాక్సైడ్ పెరగడమే ఈ మరణాలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నమయ్య జిల్లాలో ఘోర విషాదం: మోటార్‌సైకిల్ పొగ పీల్చి నలుగురు మృతి - Tholi Paluku