
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల జమకు రంగం సిద్ధం
అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను ఈ నెల 19న రైతుల ఖాతాల్లో జమ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం కీలక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, 26 జిల్లాల జేడీలతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అదే రోజున పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నందున రాష్ట్ర ప్రభుత్వ వాటాను కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కలిపి మొత్తం రూ.7,000 అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి రైతుకూ ఈ పథకం లబ్ధి అందాలని, రైతులకు చేయూతనివ్వడం భారం కాదని, ఇది అధికారుల బాధ్యత అని మంత్రి నొక్కి చెప్పారు.
ఈ నెల 19న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇన్-యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షించి, వాటిని వెంటనే యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యుటేషన్ చేసి, పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా అర్హత ఉన్న రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేయాలని అధికారులకు చెప్పారు.
అధికారులు మంత్రికి అందించిన వివరాల ప్రకారం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రెండో విడతలో మొత్తం 46,62,904 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.3,077.77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పథకంపై సందేహాల నివృత్తి కోసం తక్షణమే టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒక రోజు ముందే 'సందేశాలు' వెళ్లాలని రైతులు తమ ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. తొలి విడతలో నిధులు జమకాని అర్హుల ఫిర్యాదులను పరిశీలించి, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని అర్హత ఉన్న రైతులందరికీ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కింది స్థాయి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు.
