
అన్నదాతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొంథా తుఫాన్ కారణంగా హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నాశనమయ్యాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారని, ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలి మోటార్లలో తిరుగుతూ మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. రైతులకు నిజమైన సాయం అందించడంలో మాత్రం విఫలమయ్యారు అని విమర్శించారు. మంత్రులు పదవుల కోసం పోరాడుతుండగా, అన్నదాతలు తమ పంటల నష్టంతో ఆగం అవుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనానికి ఇదే నిదర్శనం అని అన్నారు.
ఎకరానికి కనీసం రూ.25,000 పరిహారం ప్రకటించి నష్టపోయిన రైతులందరికీ ఆర్థిక సాయం అందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అదేవిధంగా, మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యాన్ని, రోడ్లపైన ఆరబోసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. రైతుల ధాన్యాన్ని తిరస్కరించడం అన్యాయం అవుతుందని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ పరిస్థితులను స్వయంగా పరిశీలించి, పంటనష్టం వివరాలపై సంబంధిత శాఖలతో సర్వే చేయించి, తక్షణ సహాయం అందించాలన్నారు. రైతులను ఇబ్బందుల పాలు చేయకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు సకాలంలో సాయం అందించకపోతే ప్రభుత్వం రైతుల కోపానికి గురవుతుందని ఆయన హెచ్చరించారు.
అకాల వర్షాల నష్టాలకు గతంలో బీఆర్‌ఎస్ ఇచ్చిన పరిహారం..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలు, తుఫాన్ల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ప్రతి సందర్భంలో ప్రభుత్వం రైతులకు తక్షణ ఆర్థిక సాయం అందిస్తూ, నష్టాన్ని కొంత మేర భర్తీ చేయడానికి ముందుకొచ్చింది. 2021లో భారీ వర్షాలు, వడగండ్ల వానల కారణంగా వరి, పత్తి, మక్కజొన్న పంటలు నష్టపోయాయి. ఆ సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల బాధను గుర్తించి, ఎకరాకు రూ.10,000 చొప్పున పరిహారం ప్రకటించింది. ఆ సంవత్సరంలోనే సుమారు 3.5 లక్షల మంది రైతులు ఈ ఆర్థిక సాయాన్ని పొందారు.
అలాగే 2022లో మరోసారి భారీ, వర్షాల కారణంగా పంటలకు నష్టం జరగడంతో ప్రభుత్వం మళ్లీ ఎకరాకు రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య పరిహారం అందించింది. ఆ ఏడాది సుమారు 2.8 లక్షల మంది రైతులు నష్టపరిహారం పొందారు. ఈ రెండు సంవత్సరాల్లో కలిపి ప్రభుత్వం దాదాపు 2,000 కోట్లకు పైగా సాయం విడుదల చేసింది.
హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఆ సమయంలో సుమారు 12,000 నుంచి 15,000 మంది రైతులు ఈ పరిహారానికి అర్హులుగా గుర్తించబడి సాయం పొందారు.రైతు బంధు, రైతు భీమా పథకాలతో పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అకాల వర్షాల నష్టాన్ని తగ్గించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల రైతులు కొంత ఊరట పొందారని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి.
