Let's talk: editor@tmv.in
అన్నదాతకు అండగా ఉండటానికి ఎన్జీరంగానే మాకు స్పూర్తి

అన్నదాతకు అండగా ఉండటానికి ఎన్జీరంగానే మాకు స్పూర్తి

Panthagani Anusha
9 నవంబర్, 2025

రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆచార్య ఎన్జీ రంగా జీవితం అందరికీ ఆదర్శం

గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన రోజునే ఎన్జీ రంగా జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పటికీ ఎన్జీ రంగా జీవితమంతా స్వాతంత్ర్య పోరాటం, రైతు సంక్షేమానికే అంకితమైందని ఆయన గుర్తుచేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ వర్సిటీకీ ఎన్జీ రంగా పేరును పెట్టామని చెప్పారు. రూరల్ డెవలప్‌మెంట్‌పై పీహెచ్‌.డి చేయాలనుకున్నప్పుడు రంగా రచనలు తనకు స్ఫూర్తినిచ్చాయని ఆయన పేర్కొన్నారు. 33 ఏళ్లకే రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపిన రంగా, వెంకటగిరి జమీందారీ అణచివేతకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచారని వివరించారు.

1964లో 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రసంగించి రైతు భూములను రక్షించిన ఘనత రంగా దక్కించుకున్నారని తెలిపారు. 50 సంవత్సరాలపాటు పార్లమెంటెరియన్‌గా చేసిన సేవలకు గాను గిన్నిస్ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కడం అరుదైన గౌరవమని సీఎం కొనియాడారు.

రైతు సంక్షేమమే లక్ష్యం

2014–19 మధ్య వ్యవసాయ రంగం జీఎస్‌డీపీలో 16.6% వృద్ధి సాధించగా తదుపరి ఐదేళ్లలో 10%కు పడిపోయిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత 2024–25లో వృద్ధి రేటు 15.45%కి పెరిగిందని చెప్పారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రబీ సీజన్‌లో 48 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.6,000 కోట్లు మాత్రమే చెల్లించి రూ.1,674 కోట్లు బకాయిలు పెట్టాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఆ బకాయిలన్నీ చెల్లించామని గుర్తుచేశారు. 2024–25లో 55.79 లక్షల టన్నుల ధాన్యాన్ని రూ.12,857 కోట్లకు కొనుగోలు చేసి, 8 లక్షల మంది రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే డబ్బులు జమ చేశామని వివరించారు.అదేవిదంగా అన్నదాత సుఖీభవ కింద రూ.7,000 చొప్పున జమ చేసినట్టు తెలిపారు.

95% పంట బీమా చెల్లింపులు పూర్తి

ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో టెక్నాలజీ వినియోగించి ఇటీవల తుఫాను నష్టాన్ని గణనీయంగా తగ్గించాం. విపత్తుల్లో నష్టపోయిన రైతులకు 2014-19లో హెక్టారుకు రూ. 20 వేలు అందిస్తే గత ప్రభుత్వం దాన్ని రూ. 17 వేలకు తగ్గించింది. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే రూ. 25 వేలకు పెంచాం. మూడేళ్లు పంటల బీమా సొమ్ము ఎగ్గొట్టినవారు విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే 95 శాతం పంట బీమా చెల్లించాం. మామిడికి రూ. 240 కోట్లు అదనంగా గిట్టుబాటు ధర ఇచ్చాం. పొగాకుకు రూ. 273 కోట్లు ఖర్చు చేశాం. కోకో రైతుకు రూ. 14 కోట్లు ఇచ్చాం. కాఫీకి 50 కేజీల చొప్పున ఎకరాకు రూ. 5 వేలు ఇచ్చాం. మిర్చికి రూ. 130 కోట్లు, టమాటాకు రూ. 12 కోట్లు, ఉల్లి దెబ్బ తిన్న చోట హెక్టారుకు రూ. 50 వేల చొప్పున రూ. 100 కోట్లు వ్యయం చేశామని ముఖ్యమంత్రి వివరించారు.

ఎకరాకు రూ.5,000 చొప్పున, మిర్చికి రూ.130 కోట్లు, టమాటాకు రూ.12 కోట్లు, ఉల్లి పంట నష్టానికి హెక్టారుకు రూ.50,000 చొప్పున రూ.100 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. అదేవిధంగా సమర్థ నీటి నిర్వహణ, ముందస్తు చర్యలతో రిజర్వాయర్లు 95% మేర నిండాయని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో రిజర్వాయర్ల గేట్లు కూడా సరిగా నిర్వహించలేదని విమర్శించారు. రాయలసీమలో కరువును జయించామని, డ్రిప్‌ ఇరిగేషన్‌కు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ, ఇతరులకు 50–90% సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు.

కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల మార్పిడి అవసరమని సూచించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా ‘ఆధునిక రాజ్యాంగ వ్యవస్థలు’ అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, వ్యవసాయ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.