Let's talk: editor@tmv.in
అనుమానాస్పద స్థితిలో పీజీ వైద్య విద్యార్థిని మృతి

అనుమానాస్పద స్థితిలో పీజీ వైద్య విద్యార్థిని మృతి

Panthagani Anusha
6 ఫిబ్రవరి, 2026

ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న 26 ఏళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. అనంతపురం జిల్లాకు చెందిన బి. దీపిక అనస్థీషియాలజీ విభాగంలో మూడో సంవత్సరం పీజీ చదువుతోంది. తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడిన ఆమె గురువారం తెల్లవారుజామున ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు,కళాశాల వర్గాల కథనం ప్రకారం బుధవారం రాత్రి దీపిక తన జూనియర్‌తో కలిసి బయట నుంచి తెప్పించుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను భోజనంగా తీసుకున్నారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో నొప్పి నుంచి ఉపశమనం కోసం ఆమె జూనియర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే కొద్దిసేపటి తర్వాత తన జూనియర్ వచ్చి చూసేసరికి దీపిక టేబుల్‌పై అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు.

వెంటనే ఆమెను సహచర విద్యార్థులు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించారు. అక్కడ సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స ప్రారంభించి, సెలైన్ అందించడంతో పాటు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించినప్పటికీ గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో దీపిక తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.

కాగా దీపిక మృతికి గల ఖచ్చితమైన కారణాలపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఆమె తిన్న ఆహారంలో లోపమా లేక అత్యవసర సమయంలో ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మరణించింద అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అధికారులు, నివేదిక అందిన తర్వాతే మరణానికి గల వాస్తవాలు వెల్లడవుతాయని తెలిపారు. విద్యార్థిని దీపిక మృతిపై ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రితో మంత్రి మంత్రి మాట్లాదిన ఆయన తన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.