Let's talk: editor@tmv.in
అనుభవం నుంచి రాహుల్‌గాంధీ ఎప్పుడూ నేర్చుకోరు: కేరళ సీఎం

అనుభవం నుంచి రాహుల్‌గాంధీ ఎప్పుడూ నేర్చుకోరు: కేరళ సీఎం

Pinjari Chand
27 మార్చి, 2026

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ నాయకుడైనా ఆయన అనుభవం నుంచి నేర్చుకోరని, కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీకి–బీ-టీమ్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొత్తమంగళం వద్ద జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన విజయన్ రాహుల్ గాంధీకి ప్రాంతీయ నాయకుడికి ఉండే ప్రాథమిక అవగాహన కూడా లేదని అనిపిస్తోంది. విషయాలను సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు, అనుభవం నుంచి నేర్చుకోరు. ఇవి రాజకీయ నాయకుడికి సరిపోయే లక్షణాలు కావని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు, కేరళలో ఎల్‌డీఎఫ్–బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ప్రతిస్పందనగా వచ్చాయి. కేంద్ర సంస్థలు తనపై ఉన్న అవినీతి కేసుల్లో చర్యలు తీసుకోకపోవడం, ఆ రెండు పార్టీల మధ్య కుమ్మక్కుకు నిదర్శనమని రాహుల్ పేర్కొన్నారు.

ఢిల్లీలో ఆప్‌తో కాంగ్రెస్‌ ఎందుకు కలవలేదు?

దీనిపై స్పందించిన విజయన్, ఢిల్లీలో మద్యం విధాన అవినీతి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. తర్వాత కేజ్రీవాల్ నిర్దోషిగా బయటపడడం కాంగ్రెస్, బీజేపీలకు ‘చెంపపెట్టు’ అని అన్నారు. అలాగే, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆప్‌తో కలవకుండా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేయడం వల్లే బీజేపీ గెలిచిందని ఆయన విమర్శించారు. హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ సరైన కూటములు ఏర్పాటు చేయలేకపోవడంతో బీజేపీకి లాభం చేకూరిందని చెప్పారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ బీజేపీకి సహకరిస్తోందని చూపిస్తున్నాయని అన్నారు. ఇక కేరళలో కూడా దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీతో కలిసి ఎల్‌డీఎఫ్‌ను ఓడించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈఎంఎస్ నంబూదిరిపాద్ కాలం నుంచి ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్, ప్రస్తుతం బీజేపీతో కాంగ్రెస్ కలసి పనిచేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీల ఆలోచనా విధానం ఒకటే అని వ్యాఖ్యానించారు. కాబట్టి సీపీఎం–బీజేపీ కుమ్మక్కు ఉందన్న రాహుల్ ఆరోపణలు రాబోయే ఎన్నికలలో ఓటమి భయంతో ముందస్తు రక్షణ ప్రయత్నమేనని అన్నారు.

ఇదిలా ఉండగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యుడీఎఫ్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ, కేరళలో అసలు పోరు యుడీఎఫ్, ఎల్‌డీఎఫ్–బీజేపీ భాగస్వామ్యం మధ్య జరుగుతోందని ఆరోపించారు. ఎల్‌డీఎఫ్ ప్రజలను విభజిస్తోందని, యుడీఎఫ్ మాత్రం ప్రజలను ఐక్యం చేస్తోందని అన్నారు. అలాగే, ఉద్యోగాల విషయంలో హామీలు నెరవేర్చలేదని కూడా ఆయన విమర్శించారు.