Let's talk: editor@tmv.in
అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌత్ వేడుక

అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌత్ వేడుక

Dantu Vijaya Lakshmi Prasanna
12 అక్టోబర్, 2025

ముంబైలోని జుహూలో ఉన్న అనిల్ కపూర్ నివాసం లో కర్వా చౌత్ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కుంద్రా ,ఆమె భర్త రాజ్ కుంద్రా, వారితో పాటు అనేక మంది ఇతర ప్రముఖుల భార్యలు హాజరయ్యారు ఈ వేడుకకు అనిల్ కపూర్ సతీమణి సునీతా కపూర్ ప్రతి సంవత్సరం ఆతిథ్యం ఇస్తారు. ఆమె విలాసవంతమైన, సాంప్రదాయ పద్ధతిలో పూజా ఏర్పాట్లు చేయడంలో ప్రసిద్ధి .

అసలు కర్వా చౌత్ అంటే : ఉత్తర భారతదేశంలో వివాహిత మహిళలు పాటించే ఒక సాంప్రదాయ హిందూ ఆచారం. భర్తల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం మహిళలు సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం నీరు కూడా తీసుకోకుండా - నిర్జల వ్రతం ఉంటారు. చంద్రుడిని చూసి, ప్రత్యేక పూజా విధానాలను నిర్వహించిన తర్వాతే వ్రతాన్ని విరమిస్తారు.

తరతరాలుగా బాలీవుడ్ సంప్రదాయం: సునీతా కపూర్ నివాసం బాలీవుడ్ వర్గాలలో ఈ పండుగకు ముఖ్య వేదికగా మారింది. ఆమె చాలా సంవత్సరాలుగా ప్రముఖ నటీమణులను, స్టార్ భార్యలను ఆహ్వానించి, వ్రతం విరమించే ముందు అందరితో కలిసి సామూహికంగా పూజ చేయిస్తారు.

ఫ్యాషన్, మీడియా దృష్టి: ఈ కార్యక్రమం మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది, ముఖ్యంగా ఇక్కడ ప్రదర్శితమయ్యే ఫ్యాషన్ కారణంగా శిల్పా శెట్టి, రవీనా టండన్ వంటి ప్రముఖులు సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తారు. ముఖ్యంగా దంపతులుగా పలువురు తారలు ఈ వేడుకకు రావడం, సాంప్రదాయ పూజా కార్యక్రమం, చంద్రుడిని చూసి మహిళలు తమ భర్తల చేతులమీదుగా ఉపవాసం విరమించే పద్ధతులు, బావి తరాలకు వారి సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసే వేదికగా బాలీవుడ్ తారలు బావిస్తారు.

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల పాత్ర

శిల్పా శెట్టి ఈ వేడుకకు ప్రముఖంగా హాజరయ్యేవారిలో ఒకరు. ఆమె తరచుగా తన సోషల్ మీడియాలో పూజా కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను పంచుకుంటారు. ఈ ఆచారంలో భాగంగా మహిళలు తమ అలంకరించిన పూజా జల్లెడను తిప్పుతూ తమ భర్తలను అందులో నుండి చూస్తారు. శిల్పా శెట్టి , ఆమె భర్త రాజ్ కుంద్రాతో కలిసి హాజరవడం ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌లో వారి ఉన్నతమైన సామాజిక స్థాయిని,సంప్రదాయాలను పాటించడం పట్ల వారి శ్రద్ధను చూపిస్తుంది. ఈ జంట తమ సాంస్కృతిక ఆచారంలో చూపే భక్తి, భాగస్వామ్యంపై పలుమార్లు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌత్ వేడుక - Tholi Paluku