Let's talk: editor@tmv.in
అనిల్ అంబానీ దంపతులకు ఈడీ సమన్లు

అనిల్ అంబానీ దంపతులకు ఈడీ సమన్లు

Pinjari Chand
11 ఫిబ్రవరి, 2026

మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, ఆయన భార్య టినా అంబానీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. టినా అంబానీని ఫిబ్రవరి 17న, అనిల్ అంబానీని ఫిబ్రవరి 18న విచారణకు రావాలని ఈడీ పేర్కొంది. వారు హాజరైన అనంతరం వారి వాంగ్మూలాలను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద నమోదు చేయనున్నారు.

ఇంతకుముందు సోమవారం విచారణకు రావాలని ఈడీ టినా అంబానీకి నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆమె హాజరుకాలేదని అధికారులు తెలిపారు. దీంతో తాజాగా మరోసారి సమన్లను జారీ చేశారు. ఈ వ్యవహారంపై రిలయన్స్ గ్రూప్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. గత ఏడాది ఈ కేసుకు సంబంధించి అనిల్ అంబానీని ఒకసారి ఇప్పటికే ఈడీ విచారించింది. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన పలు సంస్థలు తీసుకున్న బ్యాంకు రుణాలు, వాటి వినియోగంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ విచారణ జరిగింది. టినా అంబానీని న్యూయార్క్‌లోని మాన్‌హాట్టన్‌లో ఉన్న లగ్జరీ కాండోమినియం(ధనవంతులు, సెలబ్రిటీలు కొనుగోలు చేసే అతి ఖరీదైన ఫ్లాట్లు) కొనుగోలుకు సంబంధించిన డబ్బుల లావాదేవీలపై ప్రశ్నించనున్నారు.

ఈ కేసులో ఇటీవల రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మాజీ అధ్యక్షుడు పునీత్ గార్గ్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆర్‌కామ్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియ (సీఐఆర్‌పీ) జరుగుతున్న సమయంలో, న్యూయార్క్‌లోని ఆ ఆస్తిని 2023లో మోసపూరితంగా విక్రయించినట్టు ఈడీ ఆరోపించింది. ఈ విషయాన్ని ఆర్‌కామ్ 2025లో స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసినట్టు సమాచారం.

అమెరికాలో అమ్మిన ఆ ఆస్తి ద్వారా వచ్చిన 8.3 మిలియన్ డాలర్లు (2023 నాటి లెక్కల ప్రకారం సుమారు రూ.69.55 కోట్లు) రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు తెలియకుండా, పాకిస్థాన్‌తో సంబంధాలున్న వ్యక్తి ఆధీనంలో ఉన్న దుబాయ్ సంస్థతో నకిలీ పెట్టుబడి ఒప్పందం పేరిట తరలించినట్టు ఈడీ పేర్కొంది. అదే సమయంలో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఏడీఏజీ)పై ఉన్న పలు బ్యాంకు మోసాలు, ఆర్థిక అవకతవకల కేసుల దర్యాప్తుకు ఈడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ దర్యాప్తులో ఇప్పటివరకు రూ.12 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు, రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై మూడు ఈసీఐఆర్‌లు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.