Let's talk: editor@tmv.in
అనిల్ అంబానీ కేసులో ‘సిట్’ ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టు

అనిల్ అంబానీ కేసులో ‘సిట్’ ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టు

Pinjari Chand
5 ఫిబ్రవరి, 2026

అనిల్ అంబానీ, ఆయనకు సంబంధించిన సంస్థలపై ప్రజాధనం మళ్లింపు (సైఫనింగ్) ఆరోపణలపై కొనసాగుతున్న దర్యాప్తు పూర్తి చేసి స్పష్టమైన న్యాయ నిర్ణయం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ)కు సూచించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, విపుల్ ఎం. పాంచోలీలతో కూడిన ధర్మాసనం, ఈడీ దర్యాప్తులో అనవసర ఆలస్యం జరిగిందని గమనించింది. దర్యాప్తు స్వతంత్రంగా, నిజాయితీగా, వేగంగా సాగాల్సిందేనని స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా, వేగంగా పనిచేయాలి. ఈరోజు మేము ఎలాంటి కఠిన ఆదేశాలు ఇవ్వడం లేదు. కానీ ఇకపై ఆలస్యం సహించబోమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో భారీగా ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు ఉన్నందున, ఇది కాలపరిమితితో కూడిన దర్యాప్తు కావాలని కోర్టు పేర్కొంది. ఈడీ, సీబీఐ తమ దర్యాప్తు పురోగతిపై నాలుగు వారాల్లో స్థితిగతుల నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా, సీబీఐ సీల్డ్ కవర్‌లో సమర్పించిన నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అందులో సంబంధిత ఖాతాపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వద్ద అధికారిక ఎఫ్‌ఐఆర్ నమోదైందని, ఇతర బ్యాంకుల్లోని సమాన ఖాతాలపై కూడా దర్యాప్తు జరుగుతోందని సీబీఐ తెలిపింది. బ్యాంకు అధికారులు ఎందుకు ఆర్థిక సౌకర్యాలు కల్పించారన్న అంశంపై వారి పాత్రను కూడా సీబీఐ విచారించాలని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా, కంపెనీలు, బ్యాంకులు, ప్రభుత్వ అధికారుల మధ్య ఏదైనా కుమ్మక్కు లేదా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరపాలని సూచించింది. ఈడీ, సీబీఐ తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, నకిలీ బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన ఆధారాలు లభించాయని కోర్టుకు తెలిపారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్)పై ఈసీఐఆర్ నమోదు చేశామని, యెస్ బ్యాంక్ 2017లో చేసిన పెట్టుబడులు రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ విషయాల్లో దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.

ఇప్పటి వరకు ‘కింగ్ పిన్’ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ 33 బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుందని, రూ.21,106 కోట్లకు పైగా లావాదేవీలు పరిశీలనలో ఉన్నాయని ఈడీ తెలిపింది. నెలవారీ నిధుల ప్రవాహం, బ్యాంక్ గ్యారంటీల అమలు, నిధుల మళ్లింపు నమూనాలపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. ప్రజాధనానికి జరిగిన నష్టం గణనీయమని ఈడీ వాదించింది. ఈ కేసులో కోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్ తరఫున హాజరైన ప్రశాంత్ భూషణ్ ఇంత పెద్ద మొత్తంలో దుర్వినియోగ ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రధాన సూత్రధారి (కింగ్‌పిన్) అరెస్ట్ కాలేదని తెలిపారు. వేల కోట్ల రూపాయల మోసం ఆరోపణలు ఉన్నందున కఠినమైన, స్వతంత్ర చర్యలు అవసరం అని వాదించారు.

అనిల్ అంబానీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, తమ క్లయింట్లు బకాయిల చెల్లింపులకు ప్రయత్నాలు చేస్తున్నారని, నిధుల మళ్లింపు జరిగిందన్న ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపారు. అనిల్ అంబానీ సహా ఎవరూ దేశం విడిచి వెళ్లే ఉద్దేశం లేదని, బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ కంపెనీల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, చెల్లింపులు చేసినట్లు అఫిడవిట్లు దాఖలయ్యాయని తెలిపారు. అయితే, బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారనే కారణంతో నేర విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో ఎలాంటి కఠిన లేదా బలవంతపు ఆదేశాలు ఇవ్వడం లేదని, కానీ ప్రజాధనంతో సంబంధం ఉన్నందున దర్యాప్తు సంస్థలు ఆలస్యం లేకుండా నిజాయితీగా పనిచేయాల్సిందేనని ధర్మాసనం మరోసారి హెచ్చరించింది. నాలుగు వారాల తర్వాత, ఈడీ, సీబీఐ సమర్పించే నివేదికల ఆధారంగా కేసును మళ్లీ విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.