
అనిల్ అంబానీపై బ్యాంకుల చర్యలపై బాంబే హైకోర్టు స్టే
అనిల్ అంబానీ, ఆయన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను ఫ్రాడ్‌గా ప్రకటించేందుకు మూడు బ్యాంకులు చేపట్టిన చర్యలపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఈ ప్రక్రియలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్లను బ్యాంకులు పాటించలేదని కోర్టు స్పష్టం చేసింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను ఫ్రాడ్‌గా ప్రకటించేందుకు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి. ఈ చర్యలకు ఆధారంగా ‘బీడీఓ ఎల్ఎల్‌పీ’ అనే బాహ్య సంస్థ చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ఉపయోగించాయి.
అయితే ఈ ఆడిట్ నివేదికపై అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ సంతకం లేదని న్యాయమూర్తి మిలింద్ జాధవ్ తెలిపారు. ఆర్‌బీఐ 2024 మాస్టర్ డైరెక్షన్ల ప్రకారం, ఫోరెన్సిక్ ఆడిట్ చేసే వ్యక్తి తప్పనిసరిగా చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలని కోర్టు పేర్కొంది. అందువల్ల ఈ నివేదికను ఆధారంగా తీసుకుని బ్యాంకులు చర్యలు చేపట్టలేవని స్పష్టం చేసింది.
ఈ దశలో అనిల్ అంబానీకి మధ్యంతర రక్షణ ఇవ్వకపోతే, ఆయనకు, ఆయన కంపెనీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖాతాలను ఫ్రాడ్‌గా ప్రకటిస్తే బ్లాక్‌లిస్ట్ చేయడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడం, క్రిమినల్ కేసులు నమోదు కావడం, ప్రతిష్ఠ దెబ్బతినడం వంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కోర్టు తెలిపింది.
“న్యాయం కేవలం కాగితాల మీద జరిగితే సరిపోదు, అది నిజంగా జరిగినట్లు అందరికీ స్పష్టంగా కనిపించాలి" అని హైకోర్టు ఈ సందర్భంగా చెప్పింది. చట్టబద్ధమైన అర్హత లేని ఒక బయటి సంస్థ ఇచ్చిన రిపోర్టును నమ్మి, అనిల్ అంబానీకి నోటీసులు పంపడం పద్ధతి కాదని కోర్టు పేర్కొంది. అసలైన నిబంధనలు పాటించకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం, ఒక వ్యక్తికి తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వకపోవడం అనేది సరైన న్యాయం అనిపించుకోదని కోర్టు స్పష్టం చేసింది.
అలాగే, 2013 నుంచి 2017 కాలానికి సంబంధించిన లావాదేవీలపై 2019లో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని బ్యాంకులు ఆలస్యంగా మేల్కొనడం ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది బ్యాంకుల నిర్లక్ష్యాన్ని చూపిస్తోందని పేర్కొంది.
బీడీఓ ఎల్ఎల్‌పీ ఒక అకౌంటింగ్ కన్సల్టెన్సీ సంస్థ మాత్రమేనని, ఆడిట్ సంస్థ కాదని అనిల్ అంబానీ వాదించారు. అంతేకాదు, ఆ సంస్థ గతంలో బ్యాంకులకు కన్సల్టెంట్‌గా పనిచేసిందని, అందువల్ల స్వతంత్ర ఆడిటర్‌గా వ్యవహరించలేదని కోర్టు గుర్తించింది.
బ్యాంకులు మాత్రం 2016 ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బాహ్య ఆడిటర్ సీఏ కావాల్సిన అవసరం లేదని వాదించాయి. అయితే ప్రస్తుత ఆర్‌బీఐ మాస్టర్ డైరెక్షన్లు తప్పనిసరిగా పాటించాల్సినవని, వాటికి భిన్నంగా వ్యవహరించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ మరియు రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై బ్యాంకులు చేపట్టిన అన్ని ప్రస్తుత, భవిష్యత్ చర్యలను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
