
అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో విషాదం: ఆక్సిజన్ అందక పసికందు మృతి
ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం, మౌలిక వసతుల లేమి వెరసి ఒక పసి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా ఆక్సిజన్ అందక మూడు రోజుల వయసున్న నవజాత శిశువు మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మూడు రోజుల క్రితం జన్మించిన శిశువుకు జాండిస్ (పచ్చకామెర్లు) లక్షణాలు ఉండటంతో వైద్యుల సూచన మేరకు శుక్రవారం ప్రత్యేక వార్డుకు తరలించారు. శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో నిరంతరం ఆక్సిజన్ సపోర్ట్ అందించాలని వైద్యులు సూచించారు. అయితే శనివారం ఉదయం వార్డులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు గంటకు పైగా కరెంట్ లేకపోవడంతో ఆక్సిజన్ అందించే యంత్రాలు పనిచేయడం ఆగిపోయాయి. ప్రత్యామ్నాయంగా పనిచేయాల్సిన జనరేటర్ వ్యవస్థ సిద్ధంగా లేకపోవడంతో ఆక్సిజన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సరైన సమయానికి ఆక్సిజన్ అందకపోవడంతో ఆ పసికందు కన్నుమూసింది. కాగా తన బిడ్డ ఊపిరాడక విలవిల్లాడుతున్నా సిబ్బంది ఎవరూ స్పందించలేదని ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని శిశువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
బాధ్యులపై చర్యలకు డిమాండ్
శిశువు మరణవార్తతో మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. వార్డులో కరెంట్ పోతే బ్యాకప్ ఎందుకు లేదు? అత్యవసర వార్డుల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే పేదలు ఎక్కడికి వెళ్లాలి? అంటూ బాధితులు ప్రశ్నించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరగడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. కాగా ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉండగా అసలు కారణాలపై స్పష్టత కోసం విచారణ జరగాల్సి ఉంది.
