
అనకాపల్లిలో రూ.8,175 కోట్లతో 'వారీ' గిగాఫ్యాక్టరీ
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే సరికొత్త ఇంధన శక్తి నిల్వ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది . సౌర శక్తి రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న 'వారీ ఎనర్జీస్' సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లి వేదికగా దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సుమారు రూ. 8,175 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
సమగ్ర తయారీ వ్యవస్థ.. ఒకే చోట
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం దీని ‘వాల్యూ చైన్’. కేవలం బ్యాటరీల అసెంబ్లింగ్‌కే పరిమితం కాకుండా, లిథియం-అయాన్ సెల్ తయారీ నుంచి బ్యాటరీ ప్యాక్‌ల రూపకల్పన, పెద్ద స్థాయి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వరకు పూర్తి స్థాయి వ్యవస్థను ఒకే ప్రాంగణంలో అభివృద్ధి చేయనున్నారు. ఏటా 16 గిగావాట్ గంటల వార్షిక సామర్థ్యంతో ఈ యూనిట్ పనిచేయనుంది. ఫలితంగా అధునాతన ఇంధన నిల్వ పరిష్కారాలు పూర్తి స్వదేశీ సాంకేతికతతో సాకారం కానున్నాయి.
సౌర, వాయు విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిలో ఉండే సహజమైన హెచ్చుతగ్గులు గ్రిడ్ నిర్వహణకు పెద్ద సవాలుగా మారుతుంటాయి. ఈ గిగా ఫ్యాక్టరీలో తయారయ్యే భారీ నిల్వ వ్యవస్థల ద్వారా ఉత్పత్తి అయిన గ్రీన్ ఎనర్జీని నిల్వ చేసి, విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. తద్వారా రాష్ట్రంలో నిరంతరాయంగా స్వచ్ఛ ఇంధన వినియోగానికి మార్గం సుగమం కావడమే కాకుండా గ్రిడ్ భద్రత, స్థిరత్వం కూడా గణనీయంగా మెరుగుపడనుంది.
అదేవిధంగా దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి ఈ ప్రాజెక్ట్ వెన్నెముకగా నిలవనుంది. ప్రస్తుతం మన దేశం లిథియం బ్యాటరీల కోసం విదేశాలపై ముఖ్యంగా చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. రాంబిల్లిలో ఉత్పత్తి ప్రారంభమైతే దిగుమతి వ్యయం తగ్గి, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది తయారీ రంగంలో ‘ఆత్మనిర్భర్’ లక్ష్య సాధనకు గట్టి ఊతమిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ భారీ పెట్టుబడితో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోనుంది. వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఈ గిగా ఫ్యాక్టరీకి అవసరమైన ముడి పదార్థాల సరఫరా కోసం అనేక అనుబంధ పరిశ్రమలు అనకాపల్లి పరిసర ప్రాంతాలకు తరలివచ్చే అవకాశం ఉంది.
