
అనకాపల్లిలో ఫించన్ల పంపిణీ షురూ!
అనకాపల్లి జి.వి.ఎం.సి. జోన్ పరిధిలో 84వ వార్డు ఎస్.బి.ఐ. కాలనీ లో ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. పేదల సేవలో భాగంగా ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్లను బుధవారం పంపిణీ చేశారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కలెక్టర్ పింఛన్లు అందించారు. శివారులో గల సేనాపతి మహలక్ష్మి ఇంటికి వెళ్లి, వారి సామాజిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితిని చూసి చలించిన జిల్లా కలెక్టరు వారికి ఇళ్లు మంజూరుకు గల అవకాశాలను పరిశీలించి, ప్రతిపాదనలు పంపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
పింఛన్ల పంపిణీ అనంతరం పంపిణీ తీరుపై ప్రజల స్పందనను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పెన్షను సకాలంలో, సరియైన మొత్తం అందుతున్నది లేనిది విచారణ చేసారు. పేదల సేవలో భాగంగా జిల్లాలో 257322 మంది లబ్ధిదారులకు 108 కోట్ల 63 లక్షల 35 వేల 500 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ రోజే శతశాతం పెన్షన్లు పంపిణీ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు, కదలలేని స్థితిలో ఉన్నవారికి, కళాకారులకు తదితర అన్ని రంగాలకు చెందిన వాటికి కనీస పింఛను నాలుగు వేల రూపాయలు కాగా గరిష్టంగా పదిహేను వేల రూపాయల వరకు అందించడం జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు శచీదేవి, గ్రామ,వార్డు సచివాలయ అధికారి మంజులవాణి, జివిఎంసి జోనల్ కమిషనరు కె.చక్రవర్తి, ఎపిడి వై.సంతోష్కుమార్ ఇతర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
