
అనకాపల్లిలో అణుశక్తి పరిశోధనలకు బార్క్ భారీ క్యాంపస్
విశాపట్నం నగరం అనకాపల్లి జిల్లాలో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్ ) పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈసీఏసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు విస్తరణ కోసం 148.15 హెక్టార్ల (సుమారు 366 ఎకరాలు) అటవీ భూమిని మళ్లించాలన్న బార్క్ ప్రతిపాదనను ఈసీఏసీ పరిశీలించి అనుమతించింది. ఈసీఏసీ సమావేశపు నోట్ల ప్రకారం, వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా విశాఖపట్నం తీరానికి సమీపంలో ఈ కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
3,000 ఎకరాల్లో భారీ క్యాంపస్
ఈ ప్రాంతాన్ని సైట్ సెలెక్షన్ కమిటీ సూచించగా, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఇప్పటికే ఆమోదించింది. ఈ ప్రాజెక్టు కోసం బార్క్ ఇంతకుముందే దాదాపు 3,000 ఎకరాల (1,200 హెక్టార్లు) రెవెన్యూ భూమిని సేకరించింది. కొత్తగా మళ్లించదలచిన అటవీ భూమి ప్రాజెక్టు స్థలానికి ఆనుకుని క్యాంపస్, సముద్రం మధ్యలో వ్యూహాత్మక స్థానంలో ఉంది.
ప్రాజెక్టుకు ఉన్న అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా, దీనికి సంబంధించిన డిటైల్‌డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను బహిర్గతం చేయరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కమిటీ పేర్కొంది కాగా విస్తరణ పనులలో భాగంగా చుట్టూ పరిసర గోడ, భద్రతా కంచెలు, పహారా రహదారులు, పంప్‌హౌస్‌లు, వాచ్‌టవర్స్, డ్రైనేజ్ వ్యవస్థలు ఇతర ప్రాంత అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు నివేదిక తెలిపింది. అయితే, అసలు పరిశోధన కార్యకలాపాల వివరాలు మాత్రం కమిటీ వెల్లడించలేదు. ఈ ప్రాంతంలోని 21,244 చెట్లలో కేవలం 1,722 చెట్లను మాత్రమే తొలగించాల్సి ఉంటుందని సముద్రానికి దగ్గరగా ఉన్న చెట్లను నరకరాదని ఈసీఏసీ స్పష్టం చేసింది. దీనివల్ల స్థానిక జీవవ్యవస్థపై ప్రభావం పెద్దగా ఉండదని అభిప్రాయపడింది.
ఈ విస్తరణతో దేశ నిర్మాణానికి తోడ్పడే కీలకమైన పరిశోధనలు జరుగుతాయని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ అభిప్రాయపడింది. అణుశక్తి రంగంలో ఇంధన భద్రత, ఆరోగ్యం, వ్యవసాయం, నీటి వనరులు వంటి పలు వ్యూహాత్మక రంగాల్లో ఇది తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. మరోవైపు రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం బార్క్ అభ్యర్థన మేరకు సమగ్ర పరిశీలన అనంతరం 148.15 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించడం జరిగింది. అయితే మళ్లింపుకు గురైన ఈ భూమిని భవిష్యత్తులో ప్రాజెక్టుకు సంబంధం లేని కార్యకలాపాలకు వినియోగించరాదనే షరతు విధిస్తూ ప్రతిపాదనను ఆమోదించాలని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ సిఫారసు చేసింది.
