
అనంతపురం బాలుడి హత్య కేసు… నిందితుడిపై పోలీసుల కాల్పులు
అనంతపురం జిల్లా యాడికి మండలంలో గురువారం జరిగిన ఏడేళ్ల బాలుడి హత్య కేసు పెను సంచలనం సృష్టించింది. సొంత బావమరిదిని అతి కిరాతకంగా చంపిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వారిపైనే దాడికి దిగడం.. చివరకు పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరపడం కలకలం రేపింది.
ఘటన నేపథ్యం
యాడికి మండలం కోనఉప్పలపాడు గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి వేంచంద్రను అతడి సొంత బావ సర్వేష్‌కుమార్ గురువారం కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేశాడు. కుటుంబ కలహాలా లేక మరేదైనా కారణం అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో ఉద్రిక్తత
కేసు విచారణ క్రమంలో శుక్రవారం ఉదయం నిందితుడు సర్వేష్‌కుమార్‌ను పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి (సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం) తీసుకువెళ్లారు. ఘటన ఎలా జరిగిందో వివరించాలని కోరుతూ కొండ ప్రాంతంలోకి తీసుకెళ్తుండగా నిందితుడు ఒక్కసారిగా రెచ్చిపోయాడు. పోలీసుల కళ్లు గప్పి పారిపోయేందుకు ప్లాన్ చేసిన సర్వేష్, అక్కడ పడి ఉన్న ఒక ఖాళీ బీరు బాటిల్‌ను తీసుకుని పోలీసులపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఆత్మరక్షణలో భాగంగా పోలీసుల కాల్పులు
కాగా నిందితుడు దాడిలో దాడిలో పెద్దవడుగూరు ఇన్‌స్పెక్టర్ రామ సుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ గాయపడ్డారు. నిందితుడు పోలీసులను గాయపరిచి కొండల్లోకి పారిపోవడానికి ప్రయత్నించడంతో పరిస్థితిని గమనించిన ఇన్‌స్పెక్టర్ రామ సుబ్బయ్య వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడిని నిలువరించేందుకు తన తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్లు నిందితుడి కాళ్లకు తగలడంతో అతడు అక్కడే పడిపోయాడు.
ఇక గాయపడిన నిందితుడు సర్వేష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన పోలీసు సిబ్బందికి కూడా అక్కడే చికిత్స అందుతోంది. చిన్నారి వేంచంద్ర మరణంతో విషాదంలో ఉన్న ఆ గ్రామంలో, ఈ కాల్పుల ఘటనతో మరింత ఆందోళన నెలకొంది. పోలీసులు గ్రామంలో భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
